Telugu Gateway
Andhra Pradesh

కన్ఫ్యూజన్ లో ఏపీ కాంగ్రెస్

కన్ఫ్యూజన్ లో ఏపీ కాంగ్రెస్
X

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు పెద్ద గందరగోళంలో పడిపోయాయి. ఏపీలో అధికార టీడీపీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ స్పష్టంగా ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారు. చంద్రబాబు కంటే కాంగ్రెస్ లోని నేతలు ఎక్కువ మంది ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పార్టీ భవిష్యత్ కు ప్రమాదకరం అని హెచ్చరించారు. కానీ తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు పార్టీ నాయకులు..శ్రేణులను పూర్తి గందరగోళంలోకి నెట్టాయి. ఓ వైపు కాంగ్రెస్ ఎంపీ కె వీ పీ రామచంద్రరావులాంటి వారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు పార్టీ అగ్రనేతలు అందరూ పాల్గొన్నారు. మరి రాహుల్ ఏపీ కాంగ్రెస్ శ్రేణులకు ఏమి సందేశం పంపదలచుకున్నారు. చంద్రబాబు పోరాటాన్ని గుర్తించి టీడీపీకి ఓటు వేయాలని చెబుతారా?.

గతంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పాలనపై విడుదల చేసిన ఛార్జిషీట్ ను ఉపసంహరించుకున్నామని చెబుతారా?. ప్రత్యేక హోదా విషయంలో పిల్లమొగ్గలు వేసిన తరహాలోనే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ విషయంలోనూ చంద్రబాబు ద్వంద ప్రమాణాలకు తెరతీశారు. ఒకప్పుడు ఏ మొహం పెట్టుకుని రాహుల్ గాంధీ ఏపీకి వస్తారని..నల్లజెండాలతో స్వాగతం పలికించిన చంద్రబాబు...ఇప్పుడు అదే ‘ఏ మొహన్ని’ ప్రధాని మోడీవైపునకు మార్చారు. రాహుల్ గాంధీ మద్దతు ఓకే...కానీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ‘సఖ్యత రాజకీయాల’ను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా?.

ఎన్నికల ప్రచారంలో సహజంగానే ఈ అంశాన్ని టీడీపీ వ్యతిరేకపక్షాలు జోరుగా ప్రచారం చేస్తాయనటంలో సందేహం లేదు. తన రాజకీయ అవసరాలకు అనుకూలంగా చంద్రబాబు ‘స్నేహితులను’ మార్చుకోవటంలో దిట్ట. మరి ఈ అవకాశవాద దోస్తానా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఎన్నికలు పూర్తయితే కానీ తెలియదు. త్వరలో ఏపీలో జరిగే జాతీయ స్థాయి నేతల సమావేశానికి వచ్చే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెబుతారా?. లేక తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని సూచిస్తారా?. ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it