Telugu Gateway
Andhra Pradesh

ఈ ‘రికార్డు’ దూరం..ఆ సీటుకు చేరువ చేస్తుందా!

ఈ ‘రికార్డు’ దూరం..ఆ సీటుకు చేరువ చేస్తుందా!
X

దేశ చరిత్రలోనే ‘రికార్డు’ రాజకీయ పాదయాత్ర ఇది. 341 రోజులు..3648 కిలోమీటర్లు. మరి ఈ బహుదూరపు నడక.. జగన్ ను అధికారానికి చేరువ చేస్తుందా?. అంటే ఔననే నమ్ముతున్నాయి వైసీపీ శ్రేణులు. బహుదూరపు బాటసారిగా మారిన జగన్ తనను ప్రజలు ఆశీర్వదిస్తే ‘మీ భవితకు ‘బంగారు బాట’ వేస్తానని చారిత్రాత్మక పాదయాత్ర ముగింపు సభలో ప్రకటించారు. ఏడాదికి పైగా..కోటిన్నర ప్రజలతో మమేకం అవుతూ సాగిన జగన్ పాదయాత్ర బుధవారంతో ముగిసింది. పాదయాత్ర తరహాలోనే ముగింపు సభకూ పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే తన పోరాటం ఒక్క నారాసురుడితో కాదు..రెండు పత్రికలు..కొన్ని ఛానళ్ళతో కూడా అంటూ కుండబద్దలు కొట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల గుండెచప్పుడు విన్నానని..అదే స్పూర్తితో ప్రజల సమస్యల తీర్చేందుకు కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు జగన్. పాదయాత్ర ముగింపు సభలో జగన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ.

నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ఓటు వేయరు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. జిత్తులు మారిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడు. ప్రజల దీవెనలతో చంద్రబాబు మోసాలను, అన్యాయాలను జయిస్తా. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయాలే ముఖ్యమనుకుంటున్నారు.

జాతీయ రాజకీయాలంటూ చంద్రబాబు బెంగళూరుకు వెళ్లి.. కుమారస్వామితో కాఫీ తాగుతారు. కానీ కర్ణాటక పక్కనే ఉన్న అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి ఆయనకు గుర్తుకురాదు. మరోవైపు చంద్రబాబు చెన్నయ్ వెళ్లి స్టాలిన్‌తో ఇడ్లీ సాంబార్‌ తిన్నారు. కానీ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు రైతుల గురించి ఆయన పట్టించుకోరు. విమాన చార్జీలు ప్రభుత్వమే భరిస్తోంది కదా అని ఆయన పశ్చిమ బెంగాల్‌ వెళ్లి మమతను కలుస్తారు. అక్కడకు వెళ్ళి మమతా బెనర్జీతో కలసి చికెన్ తింటారు. కానీ రాష్ట్రంలోని రైతుల దుస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పుడు ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధిచెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it