Telugu Gateway
Andhra Pradesh

ఉండవల్లి సమావేశానికి అధికారులెందుకు వచ్చారు?

ఉండవల్లి సమావేశానికి అధికారులెందుకు వచ్చారు?
X

ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసింది అధికారిక సమావేశమా?. సొంతంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశమా?. ప్రస్తుతం ఏ పార్టీలో లేనని చెబుతున్న అరుణ్ కుమార్ ఏపీ సమస్యలపై పోరాడటాన్ని ఎవరూ ఆక్షేపించరు. ఆక్షేపించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏకంగా ఇద్దరు మంత్రులను పంపటమే హైలెట్. అంత వరకూ ఓకే. ఎందుకంటే చంద్రబాబు తన రాజకీయానికి పనికొస్తుందనుకుంటే ఏ పనైనా చేస్తారు?. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన సమావేశానికి చంద్రబాబు అసలు అధికారులను ఎందుకు పంపారు?. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ప్రభుత్వ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డితోపాటు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావులు కూడా హాజరు అయ్యారు. దీంతో ఈ కార్యక్రమం ఏమైనా చంద్రబాబు ‘ప్రాయోజిత’ కార్యక్రమమా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే క్రెడిట్ ఉండవల్లికి ఎ:దుకు పోవాలి..అధికారులను పంపిస్తే చర్చ పక్కదారి పడుతుందని అయినా చంద్రబాబు ప్లాన్ కావొచ్చు?. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై గతంలో ఓ సారి ఉండవల్ల అరుణకుమార్, కుటుంబరావుల మధ్య ఛాలెంజ్ లు కూడా సాగాయి.

అయితే మంగళవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ విభజన అంశాన్ని లేవనెత్తగా..ఎప్పుడో ముగిసిన అధ్యాయం గురించి ఇఫ్పుడు ఎందుకు?. తలుపులు మూసేసో..తెరిచేసో ఏదో ఒకటి చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి న్యాయం చేయటం ఎలా అనే అంశంపైనే దృష్టి పెడితే బాగుంటుందని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై వీరంతా చర్చించారు. ఉండవల్లి నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వం ఏపీ మంత్రులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబుతోపాటు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ సీఎస్, ఏపీ బిజెపి నేత ఐ వై ఆర్ కృష్ణరావు, కాంగ్రెస్ నుంచి తులసీరెడ్డి, సీపీఐ నేత రామకృష్ణ, ఆప్ నేతలు పాల్గొన్నారు. వైసీపీ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇన్ని ఉల్లంఘనలతో రాష్ట్ర విభజన ఎప్పుడూ జరగలేదని..ఈ తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయంగా తమ వైరుధ్యాలను పక్కన పెట్టి కలసి పనిచేయటానికి పార్టీలు అంగీకరించాయని తెలిపారు.

Next Story
Share it