Telugu Gateway
Politics

ఖమ్మం ఎంపీ బరిలో తుమ్మల నాగేశ్వరరావు!?

ఖమ్మం ఎంపీ బరిలో తుమ్మల నాగేశ్వరరావు!?
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపిక చేసిన ఎంపీ సీట్లలో మార్పులు చేయనుందా?. అంటే ఔననే చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఈ సారి ఖమ్మం ఎంపీ బరిలో మాజీ మంత్రి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వరరావును బరిలో దింపే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్సీగా పంపిస్తారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో కేవలం అంతర్గత తగాదాలతోనే పార్టీ నష్టపోయిందని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అక్కడ టీఆర్ఎస్ ఓటమికి సొంత పార్టీ నేతలే తప్ప..మరెవరూ కాదని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా 16 సీట్లను దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తద్వారా కేంద్రంలో కీలక పాత్ర పోషించాలనేది ఆ పార్టీ అధినేత ప్లాన్. ఈ సారి ఎంపీ బరిలో తుమ్మల నాగేశ్వరరావు అయితే గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తుమ్మలపై గెలుపొందిన కాంగ్రెస్ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటం పక్కా అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. ఎలాగైనా ఖమ్మం ఎంపీ సీటును టీఆర్ఎస్ ఈ సారి తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే తుమ్మలను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీతో సంతృప్తి చెందుతారా? లేక ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. మొత్తానికి ఎంపీ ఎన్నికల్లో ఎన్నో వింతలు చోటుచేసుకోబోతున్నాయని చెబుతున్నారు.

Next Story
Share it