Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో కీలక వ్యక్తికి ‘జగన్’ కేసు చుట్టుకోనుందా?

టీడీపీలో కీలక వ్యక్తికి ‘జగన్’ కేసు చుట్టుకోనుందా?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు అంత టెన్షన్ లో ఉన్నారు?. కేంద్రంతో పోరాడి మరీ ‘దావోస్’ పర్యటనకు అనుమతులు తెచ్చుకున్న ఆయన అకస్మాత్తుగా తన పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు?. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కత్తి దాడి కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టగానే కలవరం ఎందుకు మొదలైంది. కేసు రికార్డులు అప్పగించకుండా అడ్డుకోవటంతో పాటు..ఏకంగా ఎన్ఐఏ విచారణ ను అడ్డుకోవాలంటూ ఏపీ సర్కారు కోర్టును ఆశ్రయించటం వెనక మతలబు ఏమిటి?. చంద్రబాబు, ఏపీ డీజీపీ చెప్పినట్లు జగన్ పై దాడి చేసింది జగన్ అభిమాని. జగన్ సీఎం కావాలని కోరుకునే వ్యక్తి అయితే ఎందుకు ఉలిక్కిపడుతున్నట్లు?. ఘటన జరిగిన వెంటనే తీర్పు ఇచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత సంఘటన ఎక్కడ జరిగింది?. దాని భద్రత ఎవరిది?. అంటూ లాజిక్కులు మాట్లాడి..అసలు ఇప్పుడు కేంద్రం ఎలా సీన్ లోకి వస్తుంది. రాష్ట్రాల్లో హక్కుల్లోకి ఎలా జొరబడుతుంది అంటూ కొత్త వాదనలు లేవదీశారు.

ఏపీ ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నేతను ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు పిలిచే అవకాశం ఉందనే సమాచారంతోనే చంద్రబాబు షాక్ కు గురైనట్లు చెబుతున్నారు. ఇదే కారణంతో ఆయన తనకు ఎంతో ఇష్టమైన ‘దావోస్’ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ కేసులో చంద్రబాబు ముందు చేసిన వ్యాఖ్యలు ...తర్వాత వేసిన రివర్స్ గేర్లు చూసిన వారెవరికైనా అనుమానాలు రావటం అనేది అత్యంత సహజం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉలికిపడుతున్న తీరు చూస్తుంటే ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కేంద్ర హోం శాఖ కూడా ఈ కేసును ఎన్ఐఏకి అప్పగిస్తున్నట్లు హైకోర్టుకు నివేదించింది. కానీ సిట్ మాత్రం కేసు వివరాలు. దర్యాప్తు నివేదిక ఇవ్వకుండా ఉన్న వైనంపై ఇప్పుడు ఎన్ఐఏ కూడా కోర్టును ఆశ్రయించాల్సి రావటం పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో ఉంది.

Next Story
Share it