ప్రియాంకపై స్వామి వివాదస్పద వ్యాఖ్యలు

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న ప్రియాంక గాంధీపై బిజెపి నేతలు నోరు పారేసుకుంటున్నారు. పలువురు అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ వివాదస్పదం అవుతున్నారు. తాజాగా బిజెపికి చెందిన సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా ప్రియాంక గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్ యత్నిస్తోందని, బైపోలార్ డిజార్డర్‌తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయలేదని ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రియాంకకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్ గా నియమిస్తూ గత బుధవారం కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్ డిజార్డర్‌గా పిలుస్తారు. మరి ఏ ఉద్దేశంతో సుబ్రమణ్యస్వామి ఈ వ్యాఖ్యలు చేశారో చూడాలి. ఇప్పటికే ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లు వేయరని బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వ్యాఖ్యానించగా.. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు.