Telugu Gateway
Politics

మోడీ స‌ర్కారుకు షాక్..గ‌రిష్ట స్థాయికి నిరుద్యోగ స‌మ‌స్య‌

మోడీ స‌ర్కారుకు షాక్..గ‌రిష్ట స్థాయికి నిరుద్యోగ స‌మ‌స్య‌
X

ఎన్నిక‌ల ముందు మోడీ స‌ర్కారుకు షాక్. దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య ఎన్న‌డూలేనంత తీవ్ర స్థాయికి చేరుకుంద‌ని వెల్ల‌డైన గ‌ణాంకాలు స‌ర్కారును ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఓ అస్త్రంగా మార‌నుంది. తాజాగా గణాంకాల క‌మిష‌న్ కు చెందిన ఇద్ద‌రు ఉన్న‌తాధికారులు ప‌ద‌వుల నుంచి వైదొల‌గుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఓ వైపు ఈ దుమారం సాగుతుండ‌గానే..నివేదిక మీడియాలో రావ‌టంతో బిజెపి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. దేశంలో నాలుగున్నర దశాబ్ధాల గరిష్టస్ధాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని ఓ సర్వే పేర్కొంది. 2017-18లో నిరుద్యోగ రేటు ఎన్నడూ లేని విధంగా 6.1 శాతానికి ఎగబాకిందని నివేదిక వెల్లడించింది. అధికారికంగా విడుదల కాని ఈ సర్వే నివేదిక తమకు అందుబాటులో ఉందని ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక వెల్ల‌డించింది. ఈ నివేదిక వెల్లడించడంలో జాప్యాన్ని నిరసిస్తూ జాతీయ గణాంక కమిషన్‌ తాత్కాలిక చైర్మన్‌ పీసీ మోహనన్‌ సమా ఇద్దరు సభ్యులు కమిషన్‌ నుంచి తాజాగా తప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

నిరుద్యోగుల‌ రేటు పెరగడంపై నోట్ల రద్దు ప్రభావం ఉన్నట్టు నివేదిక‌లో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అత్యధికంగా 7.8 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతంగా నమోదైంది. ఆర్ధిక కార్యకలాపాల్లో గత సంవత్సరాల కంటే కార్మిక ఉద్యోగుల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఉద్యోగుల సమూహం నుంచి బయటకువస్తున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక న అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ వేదికగా ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. రెండ కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు క‌దా?. ఏమైంది అని ప్ర‌శ్నించారు. నిరుద్యోగ యువ‌త‌ను దారుణంగా మోసం చేసిన మోడీని..న‌మో ఒక వెళ్లు అని చెప్పాల్సిన త‌రుణం వ‌చ్చింద‌ని ధ్వ‌జమెత్తారు.

Next Story
Share it