రాహుల్ మళ్ళీ కన్ను కొట్టారు

ఓ వైపు లోక్ సభలో రాఫెల్ స్కాంపై హాట్ హాట్ చర్చ. మధ్యలో సడన్ గా కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సభ సాక్షిగా కన్నుగీటారు. అది కాస్తా కెమెరాకు చిక్కటంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సీరియస్ అంశంపై చర్చిస్తున్న సమయంలో ఇలా కన్నుగీటడం ఏమిటనే విమర్శలు మొదలయ్యాయి. గతంలో కూడా రాహుల్ గాంధీ ఓ సారి సభలో సరదగా కన్నుగీటుతూ కన్పించారు. అప్పట్లోనూ ఈ అంశం పెద్ద వివాదమే అయింది. శుక్రవారం లోక్ సభలో రాఫేల్‌పై చర్చలో ఏఐఏడీఎంకే ఎంపీ, డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతుండగా ఆయనను అభినందించిన రాహుల్ అనూహ్యంగా వేరొకరిని చూస్తూ కన్నుగీటారు.
అంతకుముందు ఇదే అంశంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్నుగీటడం వంటి చర్యలపై క్షమాపణలు చెప్పారా అని రాహుల్‌ను ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల అనంతరం రాహుల్ మరోసారి కన్నుకొడుతూ కెమెరాల కంటపడ్డారు. రాహుల్ కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై రాహుల్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.