Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఝలక్

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్  ఝలక్
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఝలక్ ఇఛ్చారు. మాజీ ఎంపీ ఉండవల్లి మంగళవారం నాడు విజయవాడలో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశానికి స్వయంగా హాజరైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిల సంఘాల సమావేశం విషయంలో మాత్రం అందుకు భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ‘మొక్కుబడి సమావేశాలకు’ జనసేన దూరంగా ఉంటుందని లేఖలో తేల్చిచెప్పారు. బుధవారం సమావేశం పెట్టుకుని మంగళవారం సాయంత్రం సమాచారం ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. సమావేశం పూర్తి స్థాయి ఏజెండాను నిర్ణయించకుండా భేటీ ఏర్పాటు చేయటం కేవలం మొక్కుబడి వ్యవహారంగానే కన్పిస్తోందని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే అన్న అనుమానాలను రెకెత్తిస్తోంది. పోరాటంలో చిత్తశుద్ధి ఉంటేనే జనసేన చేతులు కలుపుతుందని పేర్కొన్నారు. అయితే సమావేశానికి ఆహ్వానించినందుకు పవన్ కృతజ్ణతలు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన పోరాటంలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే జనసేన చేతులు కలుపుతుందని పేర్కొన్నారు.

ఓ వైపు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ సాక్ష్యాత్తూ సీఎం ఏర్పాటు చేసిన సమావేశాన్ని తీసిపారేసేలా ఇది కేవలం మొక్కుబడి సమావేశం..రాజకీయ ఎత్తుగడ అని ప్రకటన విడుదల చేయటం తెలుగుదేశం పార్టీని షాక్ కు గురిచేసింది. వాస్తవానికి చంద్రబాబు అఖిల సంఘాల సమావేశం ముందు నుంచి ఉన్న ప్రతిపాదన కానేకాదని..ఉండవల్లి సమావేశం తర్వాతే టీడీపీ కూడా ఈ ప్లాన్ వేసిందని చెబుతున్నారు. ఓ వైపు టీడీపీకి జనసేన దగ్గర అవుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నెల రోజుల్లోపే ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ఇప్పుడు ఏర్పాటు చేసే సమావేశాల వల్ల ఏమైనా ఫలితాలు ఉంటాయా? అన్న సందేహం అందరిలో నెలకొంది.

Next Story
Share it