Telugu Gateway
Cinema

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ
X

తెలుగు సినీ పరిశ్రమలో రాముడు అయినా..కృష్ణుడు అయినా ఎన్టీఆరే. నిజమైన దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియని వారికి..సినిమాల్లో ఎన్టీఆర్ ను ఆ పాత్రల్లో చూశాక.. ఆ ఫోటోలే చాలా చోట్ల దేవుడి ఫోటోలు అయ్యాయి. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ అంతగా సక్సెస్ సాధించారు. ఆ పాత్రల్లో అంతటి ఆదరణ పొందిన తెలుగు సినీ హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ అంతకు ముందు ఏమి జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు అనదగ్గ వారంతా ఏమనుకున్నారు?. రామారావు ఏంటి?. కృష్ణుడు ఏంటి? మార్చు అంటూ దిగ్గజ దర్శకుల మధ్య చర్చ. కానీ కృష్ణుడు పాత్ర మేకప్ వేసుకుని ఎన్టీఆర్ గది నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసిన వారు నిశ్చేష్టులై పోవాల్సిందే. ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ఎదగటానికి ఎన్ని కష్టాలు పడ్డారు. ఎన్ని రోజులు రోజులు తిండి లేకుండా గడిపారు?. కన్న కొడుకు చనిపోయినా నిర్మాతకు నష్టం రాకూడదని తన షూటింగ్ పూర్తయ్యే వరకూ ఉండిపోయిన అంకితభావం..సినిమాలపై ఎన్టీఆర్ లో ఉన్న కసిని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో దర్శకుడు క్ర్రిష్ కళ్లకుకట్టినట్లు చూపించారు.

అసలు ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తారు అనగానే చాలా మందికి ఈ సినిమాపై నిరుత్సాహం వచ్చిందనే చెప్పొచ్చు. అసలు ఇలాంటి ప్రయోగం చేయటమే తప్పు అనే వ్యాఖ్యలూ విన్పించాయి. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ గా నటించిన బాలకృష్ణ మేకప్ తర్వాత బయటకు వచ్చే సన్నివేశం..సెట్ లోని వారి స్పందన సినిమాకే హైలెట్ గా నిలిచింది. రాయలసీమ కరవు, దివిసీమ ఉప్పెన సమయంలో చిత్రీకరించిన భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. రిజిస్టార్ కార్యాలయంలో ఎన్టీఆర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చే ముందు ‘సంపాదించే వాడే ఇంటికి యాజమాని. కానీ అవినీతిపరుల ఇంటికి ఎంత మంది యాజమానులో’ అని చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. ఇలాంటి డైలాగ్ లు సినిమాలో ఎన్నో. పద్మశ్రీ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెల్ళినప్పుడు అక్కడ ఇందిరాగాంధీతో పీవీ నరసింహరావు పరిచయం చేయటం.. ఇందిరా మదరాసీ అన్నప్పుడు ఎన్టీఆర్ డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. పక్కనే ఉన్న అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కూడా ఆకట్టుకుంటుంది.

సినీరంగాన్ని వీడి రాజకీయాల్లోకి రావాలని రామారావు నిర్ణయించుకున్న తర్వాత బసవతారకం..రామారావుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చిత్రంలో హైలెట్ గా నిలుస్తాయి. ‘నిన్ను ఇక్కడ అందరూ దేవుడు అంటున్నారు. అక్కడ నువ్వు కూడా అందరిలాంటి మనిషివి అయిపోతావు బావా.’అని బసవతారకం వ్యాఖ్యానిస్తే...నన్ను దేవుడిని చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషికి మారటానికి రెడీ’ అంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన పాత్ర పోషించిన బాలకృష్ణ కంటే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పోషించిన సుమంత్ అచ్చం అక్కినేని నాగేశ్వరరావును తలపించారని చెప్పొచ్చు. బసవతారకం పాత్రను పోషించిన విద్యాబాలన్ సినిమాకు ప్రాణంగా నిలిచారు. మిగిలిన ప్రముఖుల పాత్రల నిడివి స్వల్పంగానే ఉన్నా...ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాల్లో పాటలు..సన్నివేశాలు పెట్టి బయోపిక్ లో కాస్త జోష్ నింపే ప్రయత్నం చేశారు. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం ఒక్కటే సినిమాకు కాస్త మైనస్ గా ఉంది. ఓవరాల్ గా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో బాలకృష్ణ హిట్ కొట్టారనే చెప్పొచ్చు.

రేటింగ్. 3.5/5

Next Story
Share it