Telugu Gateway
Andhra Pradesh

దుబాయ్ ఫ్లైట్స్ పై ‘చంద్రజాలం’!

దుబాయ్ ఫ్లైట్స్ పై  ‘చంద్రజాలం’!
X

ఏపీలో ప్రస్తుతం అసలు సమస్యలే లేవు. రాష్ట్ర ప్రజలు అందరూ విజయవాడ నుంచి సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ లకు విమానాలు నడిపితే చాలు..ఇక ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వీటిపై ఫోకస్ పెడుతున్నారా?. ఇప్పటికే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును ఇండిగో సంస్థకు ఎదురిచ్చి మరీ సింగపూర్ కు సర్కారు విమాన సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఇండిగో నడిపే విమానంలో సీట్లు భర్తీ కాకపోతే ఏపీ సర్కారే ఈ మొత్తాన్ని భరిస్తుంది. అదే వయబులిటి గ్యాఫ్ ఫండింగ్ (వీజీఎఫ్). ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అలాంటిదే ఓ ప్లాన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) తన వెబ్ సైట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. అదేంటి అంటే విజయవాడ నుంచి దుబాయ్ కు విమానాలు నడపటంపై ప్రజల నుంచి ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోంది. ప్రజాభిప్రాయం అంటే ఆసక్తిగా ఉన్నారా?. అవసరం లేదా అనే రెండు ఆప్షన్లు ఉండాలి. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం ‘ఇంట్రెస్టెడ్’ ఆనే ఒక్క ఆప్షన్ పెట్టి వదిలేసింది. ఆ పోల్ లో రెండో ఆప్షనే లేదు.

అలాంటపప్పుడు అది ప్రజాభిప్రాయం ఎలా అవుతుంది?. కేవలం ఒక్కటే ఆప్షన్ పెట్టి ఓట్లు వేయించుకుని ..ప్రజలు కోరుతున్నారు కాబట్టి దుబాయ్ కు విమానాలు నడుపుతామని చెబుతారా?. కేవలం ఇంట్రెస్టెడ్ ఆప్షన్ ఒక్కటే ఉండటంతో ఇప్పటి వరకూ అంటే జనవరి 14 ఉదయం 10 గంటల వరకూ 73035 మంది మాత్రం దీనికి ఓటు వేశారు. ఇలా దొంగ ఓటింగ్ లు పెట్టే ముందుకు ప్రభుత్వం తాను చేయాలకున్నది చేస్తే పోయేదిగా అంటూ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంటే సర్కారు సింగపూర్ తరహాలోనే దుబాయ్ కు కూడా విజయవాడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభింపచేయటం ద్వారా ఏపీని అంతర్జాతీయ గమ్యాలతో అనుసంధానం చేశామని గొప్పలు చెప్పుకోవాలనుకుంటుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it