Telugu Gateway
Politics

ఇక ముందస్తు సర్వేలు చెప్పను..లగడపాటి

ఇక ముందస్తు సర్వేలు చెప్పను..లగడపాటి
X

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో చేసినట్లే..సర్వేల పేరుతో ఏపీ ఎన్నికల్లోనూ లగడపాటి గోల్ మాల్ చేసేందుకు రెడీ అవుతున్నారని..అందులో భాగంగానే తాజాగా అర్థరాత్రి పూట ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో కలసి చంద్రబాబు నివాసంలోకి వెళుతున్న ఫోటోలతో సహా జోరుగా ప్రచారం జరిగింది. ఢిల్లీలో బుధవారం నాడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడిన తీరు చూస్తే ప్రస్తుతం జోరుగా సాగుతున్న ప్రచారానికి వివరణ ఇఛ్చినట్లే ఉంది. రాబోయే రోజుల్లో తాను ఎన్నికల ముందు ఎలాంటి సర్వేలు బహిర్గతం చేయనని తెలిపారు. ఏదైనా ఎన్నికల తర్వాతే చెబుతానని తెలిపారు. అయితే ఎవరైనా తన ఫ్రెండ్స్ వ్యక్తిగతంగా కోరితే వారికి మాత్రం వివరాలు అందిస్తాను తప్ప..తనంతట తాను బహిరంగంగా ఎలాంటి సర్వే ఫలితాలను వెల్లడించనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీ గురించి ప్రశ్నించగా..ముఖ్యమంత్రిని కలవటం సాధారణమేనని..ఇలాంటి భేటీలు చాలా జరుగుతాయని..ఒక్క చంద్రబాబుతోనే కాదు..అందరు నేతలతోనూ కలుస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఫలితాలపై కూడా స్పందించారు.

తెలంగాణ ఫలితాలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. పన్నెండు సంవత్సరాల్లో తొలిసారి తన అంచనాలు తలకిందులు అయ్యాయని తెలిపారు. దీనికి గల కారణాలను కూడా విశ్లేషిస్తున్నానని..పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి మీడియా ముందుకు వస్తానని తెలిపారు. ‘పోలింగ్ శాతం చెప్పటానికి ఈసీ కి చాలా సమయం పాట్టింది. వీవీప్యాట్ లు లెక్క పెట్టాలని నేను భావిస్తున్నాను. అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనపరుస్తున్నట్లు ఉందని అన్నారు. తాను ఎవరి ఒత్తిడితో అబద్ధాలు చెప్పలేదని..తన మాటకు కట్టుబడి ఉంటనన్నారు. తాను ఎన్నికల్లో పోటీచేస్తే అందరికీ చెప్పే చేస్తానని..చాటుమాటుగా రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అవకాశం వస్తే తెలంగాణలో పోటీచేస్తానని లగడపాటి తెలిపారు.

Next Story
Share it