చంద్రబాబులో అంత ఉలికిపాటు ఎందుకు?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?. అసలు అంత కంగారుపడాల్సిన అవసరం ఉందా?. ఆ దాడి వెనక ఏమైనా టీడీపీ నేతల హస్తం ఉందా?. లేకపోతే కేంద్ర సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కి ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి విచారణ బాధ్యత అప్పగిస్తే ఎందుకు చంద్రబాబు మోకాలడ్డుతున్నారు. ఈ తీరు చూస్తుంటే నిన్న మొన్నటివరకూ ఎలాంటి అనుమానాలు లేనివారికి కూడా కొత్త అనుమానాలు వచ్చేలా ఉంది పరిస్థితి. రాజకీయంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మధ్య రాజకీయంగా ఎంత వార్ నడుస్తున్నా...ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ ముఖ్యమంత్రిని ఈ కేసులో టార్గెట్ చేయగలరా?. విశాఖ పోలీసులు కూడా ప్రభుత్వ ఆదేశాలు లేకుండా తాము కేసు వివరాలు అందజేయలేమంటూ ఎన్ఐఏ అధికారులకు చెప్పేశారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కూడా ఈ కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించటాన్ని సవాల్ చేసే అంశంపై పలు సమావేశాలు నిర్వహించారు. ఓ వైపు అసలు జగన్ పై దాడి జరిగిన ప్రాంతం కేంద్రం పరిధిలోనిది..తమకేమి సంబంధం అని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం మేం విచారణ చేస్తే..మీరు ఎలా వస్తారు?.
మా హక్కులు హరిస్తారా?. ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తారా? అంటూ కొత్త రాగాలు అందుకోవటం వెనక మతలబు ఏమిటి?. అదే ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ను మావోయిస్టులు హత్య చేసిన కేసును ఎన్ఐఏ టేకప్ చేసినప్పుడు లేని అభ్యంతరాలు జగన్ కేసు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తున్నాయి?. ఎందుకు చంద్రబాబునాయుడు ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారు?. ఈ తతంగం అంతా చూస్తుంటే ప్రజల్లో అనుమానాలు పెరిగేలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు తప్ప...ఓ బాధ్యత గల సీఎంగా చేయటంలేనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.