Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

కొడుకుకు ఉషోదయం..ఏపీకి సూర్యాస్తమయం

0

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు లేవనెత్తిన ఆత్మగౌరవం నినాదాన్ని హేళన చేశారు. ఆత్మగౌరవం అంటే చంద్రబాబు కుటుంబం ఒక్కటేనా? అని ప్రశ్నించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు చంద్రబాబు రెండు సార్లు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఒకసారి అధికారం లాక్కొని..మరోసారి కాంగ్రెస్ తో టీడీపీ జట్టుకట్టి అని విమర్శించారు. చంద్రబాబు తన అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ పాదాల ముందు తన శిరస్సు ఉంచారని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక ఎన్టీ రామారావు అని, అయితే ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చిన వ్యక్తి తెలుగు ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కొడుకు జీవితంలో వెలుగులు నింపడం కోసం.. ఏపీని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవమంటే ఆ ఒక్క కుటుంబ ప్రయోజనాలేనా అని దుయ్యబట్టారు. ఆదివారం ప్రధాని మోదీ రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, నరసరావుపేట, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ బూత్‌ కమిటీ కార్యకర్తలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

అనంతపురం నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్, నరసరావుపేట నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కర్నూలు నుంచి పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలందరిని నిర్లక్ష్యం చేసి తమ అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా  పనిచేయడమంటే.. అది తెలుగు వారి ఆత్మగౌరవమా? వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకొని ప్రతి రోజూ అసత్యాలతో, అసభ్య పదజాలంతో మోదీని తిడితే అది తెలుగువారి ఆత్మగౌరవం అవుతుందా? ముఖ్యమంత్రిగా ఫెయిల్‌ అయి ప్రధాని కావాలని కలలు కనడం తెలుగువారి ఆత్మగౌరవం కిందకే వస్తుందా?’’ అని మోదీ విమర్శలు గుప్పించారు. తన కుమారుడికి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో మిగిలిన వారి కుమారులు, కూతుర్ల ప్రయోజనాలను పరిరక్షించడం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కాకినాడలో మహిళా కార్పొరేటర్‌ను ‘ఫినిష్‌’ చేస్తానంటూ సీఎం వ్యాఖ్యానించడం, ఇటీవల కాలంలో పలుచోట్ల బీజేపీ నాయకులపై టీడీపీ నేతల దాడుల గురించి కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

- Advertisement -

ఎవరైనా సహనం ఎప్పుడు కోల్పోతారో మీరే చెప్పండి. రాజకీయ ప్రత్యర్థులపై అసహనంతో బెదిరింపులకు దిగి మాట్లాడుతున్నారంటే.. ఆ నాయకుడికి ఓటమి భయం పట్టుకుందని తేటతెల్లమవుతుంది. అధికారం ఉండి, అంత యంత్రాంగం ఉన్న వ్యక్తి అలా మాట్లాడారంటే .. అది బీజేపీ కార్యకర్తలు సాధించిన విజయంగా పరిగణించాలి. ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతున్నట్టు, అందుకు అభినందిస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీని తక్కువగా అంచనా వేయొద్దని.. త్రిపుర రాష్ట్రంలో సున్నా స్థాయి నుంచి అధికారం కైవసం చేసుకోవడాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పునరావృతమవుతుందని, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.