Telugu Gateway
Politics

మోడీ ‘మాస్టర్ స్ట్రోక్’

మోడీ ‘మాస్టర్ స్ట్రోక్’
X

ఎన్నికల ముంగిట ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యర్ధి పార్టీలకు ‘మాస్టర్ స్ట్రోక్’ ఇఛ్చారు. ఎవరూ ఊహించని రీతిలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం విపక్షాలను నివ్వెరపోయేలా చేసింది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా పార్టీలు పేర్కొంటున్నా...రాజకీయంగా ఇది వచ్చే ఎన్నికల్లో బిజెపికి పెద్ద ఎత్తున మేలు చేయటం ఖాయంగా కన్పిస్తోంది. అసలు ఇలాంటి కసరత్తు ఒకటి చేస్తున్నట్లు ఏ మాత్రం బహిర్గతం కాకుండా ఊహించని రీతిలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో విపక్షాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ అంశంపై ఎవరికి వారు తమ వాదనలు విన్పించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ నిర్ణయం ఖచ్చితంగా బిజెపికి లాభం చేకూర్చిపెట్టేదే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ నిరుద్యోగ యువత నుంచి వస్తోంది. ఇప్పుడు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అగ్రవర్ణాలకు చెందిన యువత ఖచ్చితంగా స్వాగతిస్తుంది.

సోమవారం నాడు ఢిల్లీలో సమావేశం అయిన కేంద్ర మంత్రి మండలి అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది. అగ్రవర్ణాల్లో రూ 8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర కేబినెట్‌ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మోదీ సర్కార్‌ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది.

కేబినెట్‌ నిర్ణయంతో జనరల్‌ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. కాగా మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల పరిమితిని 50 నుంచి 60 శాతానికి పెంచుతూ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయనుంది. కేంద్రం ఇఫ్పుడు రిజర్వేషన్ల తేనెతుట్టను కదిలించటంతో పలు రాష్ట్రాలు కొత్త కొత్త డిమాండ్లు లేవనెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం లెక్కన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇఛ్చింది. అయితే కేంద్రం మాత్రం 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచే ఛాన్స్ లేదని తెగేసి చెప్పింది. ఏపీలో కాపులకు రిజర్వేషన్ అంశంపై కూడా సమస్య ఎదురైంది. మరి ఇఫ్పుడు ఆయా రాష్ట్రాల తమ డిమాండ్లను తిరిగి లేవనెత్తే అవకాశం కన్పిస్తోంది.

Next Story
Share it