Telugu Gateway
Politics

ఉండవల్లిని నమ్మారు..చంద్రబాబును నమ్మలేదా?

ఉండవల్లిని నమ్మారు..చంద్రబాబును నమ్మలేదా?
X

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఎంత అవమానం?. మాపీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను నమ్మిన ఏపీ పార్టీలు..చంద్రబాబును మేం నమ్మం బాబూ అని తేల్చిచెప్పాయా?. చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నాడు అమరావతిలో జరిగిన అఖిలపక్షసమావేశానికి ఒక్క ప్రధాన పార్టీ కూడా హాజరు కాకపోవటంతో చంద్రబాబునాయుడు మరోసారి రాజకీయంగా ఒంటరి అయినట్లు అయింది. ఉండవల్లి పిలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు కాంగ్రెస్, బిజెపి, ఏకంగా అధికార టీడీపీ, సీపీఐ, ఆప్ పార్టీలతో పాటు..మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కూడా హాజరయ్యారు. కానీ అదే చంద్రబాబు పిలిచిన అఖిల సంఘాల సమావేశానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో పాటు మరికొన్ని సంఘాలు మాత్రమే హాజరయ్యాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ ప్రభుత్వం సాక్ష్యాత్తూ ఇద్దరు మంత్రులు...అధికారులను పంపింది అంటే..తమ వైఫల్యాన్ని అంగీకరించినట్లు అయిందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇంత కంటే సిగ్గు చేటు అయిన విషయం ఉంటుందా? అని వ్యాఖ్యానించారు.

గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీలో అధికారంలో ఉండి..మూడున్నర సంవత్సరాలు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములు ఉండి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబునాయుడు చేయలేని పని ఉండవల్లి అరుణ్ కుమార్ సారధ్యంలో అవుతుందని నమ్మి మంత్రులు..అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారా? అని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉండవల్లి సమావేశానికి మంత్రులను పంపటం చంద్రబాబునాయుడు చేసుకున్న అతి పెద్ద సెల్ఫ్ గోల్ గా వారు పేర్కొంటున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి ఏ ప్రధాన పార్టీ హాజరుకాకపోవటం పరిస్థితిని మరింత దిగజార్చిందని..ఇతర పక్షాలకు ఓ అస్త్రాన్ని ఇచ్చినట్లు అయిందని చెబుతున్నారు.

Next Story
Share it