పార్లమెంట్ చరిత్రలో ‘సస్పెన్షన్ల’ రికార్డు

ఈ పార్లమెంట్ సమావేశాలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులపై సస్పెన్షన్ల వేటు పడుతుంది. ఈ సారి ఏకంగా 45 మంది ఎంపీలు వేటుకు గురవటం విశేషం. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ వీరిని సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం 24 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్ ..గురువారం మరో 21 మందిని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
ఈ 45 మంది ఇక ఈ సెషన్‌లో సభకు హాజరుకావొద్దని ఆదేశించారు. జనవరి 8న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. గురువారం సభ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో 13 మంది టీడీపీ ఎంపీలు, ఏడుగురు ఏఐఏడీఎంకే సభ్యులు ఉన్నారు. ఇంత మంది సభ్యులపై స్పీకర్ ఒకేసారి చర్యలు తీసుకోవడం పార్లమెంట్ చరిత్రలో అసాధారణ పరిణామమని భావిస్తున్నారు. డిసెంబర్ 11న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కావేరి అంశంపై ఏఐఏడీఎంకే సభ్యులు తరచూ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే.