రామ్ గోపాల్ వర్మ ‘హంగామా’
కోర్టు కేసులు..విమర్శలు ఎన్ని వస్తున్నా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ మాత్రం వెరవటం లేదు. తనదైన శైలిలో ముందుకు సాగుతూనే ఉన్నారు. తాజాగా ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి కొత్త స్టిల్స్ విడుదల చేశారు. ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ నాయకులు అంతా భోజనం చేస్తున్న స్టిల్‌తో పాటు మరో స్టిల్‌ను రిలీజ్ చేశారు. వర్మ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటునే తనదైన స్టైల్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా కోసం వర్మ ఎంపిక చేసిన పాత్రదారులు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఎన్టీఆర్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయిన ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతున్న ఈ బయోపిక్ ల సీజన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైన..అసలైన స్టోరీ అని వర్మ చెబుతున్నారు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా..మహానాయకుడు వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. మరి ఎవరి సినిమా ఎక్కువ సంచలనం సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.