Telugu Gateway
Politics

కోట్లకు క్యాడర్ ఏమి చెబుతోంది?

కోట్లకు క్యాడర్ ఏమి చెబుతోంది?
X

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు జిల్లాలోని ఆయన క్యాడర్, లీడర్లు ఏమి చెబుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా ‘సైకిల్’ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ప్రస్తుతానికి టీడీపీకి కొంత మేర మేలు చేయవచ్చు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారిన వెంటనే ఆయన క్యాడర్ కూడా ఆయనతో పాటే వస్తుందా?. అంటే అక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 70 నుంచి 80 శాతం వరకూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చెందిన క్యాడర్ టీడీపీలో చేరటాన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే ఆయన అభిప్రాయ సేకరణ ప్రతిపాదనను కూడా విరమించుకుని నేరుగా నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంత వ్యతిరేకతలో కోట్ల పార్టీ మార్పు ఫలితాలను ఇస్తుందా?. అన్నది వేచిచూడాల్సిందే. కొంత మంది కోట్ల అభిమానులు వైసీపీలో చేరాలని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చి..సైకిల్ ఎక్కేందుకే నిర్ణయించుకున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఈ విషయంలో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఈ సారి ఆ పార్టీ ఎంపీ సీటును బీసీలకు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో బీసీల ప్రభావం అత్యంత కీలకంగా ఉంటుంది.

సామాజికపరంగా రెడ్లు, బీసీలు ఒక్కటైతే కర్నూలు ఎంపీ సీటును వైసీపీ అలవోకగా దక్కించుకోగలుగుతుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. మరో వైపు కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి వస్తున్న అంశంపై ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత కె ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ పరిణామాలు పార్టీకి అంతిమంగా లాభం చేకూరుస్తాయా? లేక పుట్టి ముంచుతాయా?అన్నది తేలాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోమవారం రాత్రి అమరావతిలో తన కుటుంబ సభ్యులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాతే ఆయన ఈ భేటీకి ఆసక్తి చూపినట్లు స్పష్టం అవుతోంది. అయితే కోట్ల పెడుతున్న సీట్ల డిమాండ్లను టీడీపీ నెరవేరుస్తుందా?. లేదా వేచిచూడాల్సిందే. ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్న కోట్ల కుటంబం టీడీపీలో చేరటం వెనక పలు అంశాలు ఇమిడి ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Next Story
Share it