మానుకోట ఘటన మర్చిపోయిన జగన్ !
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయినా..ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి అయినా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యం. అందుకే వాళ్ళిద్దరూ చాలా కన్వీనెంట్ గా పాత విషయాలను ఎప్పటికప్పుడు మర్చిపోయి..కొత్త విషయాలపైనే ఫోకస్ పెడతారు. తెలంగాణ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడే స్వయంగా తాను కెసీఆర్ కు ఫోన్ చేసి కలసి పనిచేద్దామని ప్రతిపాదించానని..కానీ ఆయన రాకపోవటంతోనే కాంగ్రెస్ తో కలవాల్సి వచ్చిందని బహిరంగంగా వ్యాఖ్యానించారు. కెసీఆర్ కనక పొత్తుకు రెడీ అని ఉంటే కాంగ్రెస్ తో కలవాల్సిన ప్రజాస్వామ్య అనివార్యత అనేది ఉండేది కాదు. టీఆర్ఎస్ వద్దన్నది కాబట్టే ఈ పరిస్థితి అన్న మాట. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అసలు జగన్ తెలంగాణలోకి అడుగు పెట్టడానికే వీల్లేదని టీఆర్ఎస్ నినదించింది. అంతే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోటలో జగన్ ప్రయాణిస్తున్న రైలుపై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. అప్పట్లో వైసీపీలో ఉన్న కొండా సురేఖ పోలీసులతో ఢీ కొట్టి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో చాలా మంది పోలీసులకు..కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒకప్పుడు అసలు తెలంగాణలో జగన్ అడుగు పెట్టడానికే వీల్లేదన్న పార్టీతో కలసి జగన్ ఇప్పుడు ఏపీ హక్కుల కోసం పోరాడతారట. అంతే కాదు...కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను సమర్ధించేందుకు జగన్ చూపిస్తున్న కారణాలు కూడా వింతగా ఉన్నాయి.
ప్రత్యేక హోదా కు కెసీఆర్ మద్దతు. తాజా ఎన్నికల సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు మొదలకుని టీఆర్ఎస్ నేతలు అందరూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నుంచి పరిశ్రమలు అన్నీ ఏపీకి తరలిపోతాయని ప్రచారం చేశారు. అంతే కాదు..సోనియాగాంధీ మేడ్చల్ లో జరిగిన సభలో సోనియా ప్రత్యేక హోదా హామీని ఇస్తే టీఆర్ఎస్ నేతలు అందరూ ఒకటే మాట అన్నారు. తెలంగాణ గడ్డపై ప్రచారం చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే కెసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించారు. మరి ఎన్నికల ముందు టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మర్చిపోయారని అనుకోవాలా?. ఏపీలో ప్రస్తుతం తనకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి తన చర్యల ద్వారా ప్రతికూలంగా మార్చుకుంటున్నారనే ఆందోళన ఆ ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.