Telugu Gateway
Politics

కార్పొరేట్ కాలేజీల ర్యాంకులు..తెలంగాణ కేబినెట్ విస్తరణ తేదీలు

కార్పొరేట్ కాలేజీల ర్యాంకులు..తెలంగాణ కేబినెట్ విస్తరణ తేదీలు
X

ఛానళ్లలో కార్పొరేట్ కాలేజీల ప్రకటనలు ఇలా వస్తుంటాయి. 1...2....3...5. ఇలా నెంబర్లు చెప్పుకుంటూ పోతుంటారు. గత కొంత కాలంగా పత్రికలు కార్పొరేట్ కాలేజీల యాడ్స్ ను తలపిస్తూ తెలంగాణ మంత్రి విస్తరణ తేదీలను కూడా అలాగే ప్రకటిస్తున్నాయి. 1 లేదా 2 లేదా 3 లేదా..5 అంటూ రకరకాలు తేదీలు వేస్తూ పదవుల ఆశిస్తున్న వారిని గందరగోళంలోకి నెడుతున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తొలుత ఈ నెల 18నే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని..ఈ మేరకు జీఏడీకీ ఆదేశాలు అందాయంటూ కూడా వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కెసీఆర్ ఐదు రోజుల యాగం ముగియటంతో ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలకు కొత్త పదవులు యోగం అంటూ హంగామా మొదలైంది. ఏది ఏమైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండటం..ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో మొత్తానికి వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ పూర్తి అవుతుందని ఆశావహులు ధీమాతో ఉన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో నేతలు మరింత చురుగ్గా పనిచేసేందుకు వీలుగా అన్ని ఖాళీలను భర్తీ చేయకుండా తొలి దశలో కొంత మందికే ఛాన్స్ ఇస్తారని బలంగా ప్రచారం జరుగుతోంది.

అయితే కాంగ్రెస్ కారణంగా పాలన ఆగిపోతుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కెసీఆర్ ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండా మంత్రివర్గ విస్తరణలో జాప్యం చేయటంపై అధికార వర్గాల్లోనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకూ మంత్రివర్గం లేకపోవటంతో అధికారులు తాము చేపట్టాల్సిన పనులపై తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన మునిసిపల్, విద్యా, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పనులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. అయితే నిధుల కొరత కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it