Telugu Gateway
Andhra Pradesh

నాలుగున్నరేళ్ళు దోచుకోవటం..ఎన్నికల ఏడాది దోచిపెట్టటమా?

నాలుగున్నరేళ్ళు దోచుకోవటం..ఎన్నికల ఏడాది దోచిపెట్టటమా?
X

ఇదేనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించే సుపరిపాలన?. ఇదేనా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం. దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించని విధంగా ఏపీని పరుగులు పెట్టించానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎందుకంత హైరానా పడుతున్నారు?. ఎన్నికల ముందు ఆయన హంగామా చూస్తుంటే ప్రజలకు ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాల పాటు అడ్డగోలుగా అందినంత దోచుకోవటం. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు ఉందనగా పెన్షన్లు పెంచేసి...రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు జమచేసి..డ్వాక్రా మహిళలకు వరాలు ప్రకటించేయటం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చివరి మూడు..నాలుగు నెలల్లో కొత్త పథకాల పేరుతో ప్రజల సొమ్ముతో ఏకంగా ఓట్లు కొనుక్కోవటమే అన్న మాట. మళ్లీ అధికారంలోకి వచ్చాక మరో నాలుగున్నర సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట. గెలిస్తే తన పాలనకు ఆమోదం..తన అనుభవానికి గుర్తింపు అంటూ ప్రచారంలో హోరెత్తించటం. ‘రియల్ టైమ్ గవర్నన్స్’తో సుపరిపాలన అందించే చంద్రబాబుకు పెన్షనర్లు..రైతులు..డ్వాక్రా మహిళలు ఇప్పటివరకూ కష్టాల్లో ఉన్నారని ఆయన ‘కంప్యూటర్లు’ ఇంత కాలం చూపించలేదా?. ఇప్పుడే అవి కూడా నిద్రలేచాయా?.

ఎన్నికల ఏడాది వరకూ సమాజంలో కష్టాలు పడుతున్న వారి బాధలు పార్టీలకు ఏ మాత్రం గుర్తుకు రావు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఆకస్మాత్తుగా ఆయా వర్గాలపై ప్రేమ పుట్టుకొస్తుంది. ఇదేమి ఎన్నికల రాజకీయం?. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరిగేది ఇలాగేనా? అని ఓ సీనియర్ అధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయ నేతలే దేశాన్ని దివాళా తీయించేలా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇది అన్ని పార్టీలకు సమాన అవకాశాల కల్పన (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఉద్దేశాన్ని దారుణంగా ఉల్లంఘించినట్లు కాదా?. అధికారంలో ఉన్న ప్రతిపార్టీ తొలి నాలుగున్నర సంవత్సరాల పాటు తమ దోపిడీని కొనసాగించుకుని ..చివరి ఏడాదిలో మాత్రం ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో వివిధ వర్గాలకు డబ్బులు ఇచ్చి గెలిచిరావటమేనా రాజకీయం అంటే?? ఏ పథకం ప్రవేశపెట్టడానికి అయినా ...అర్హులైన ప్రజలకు మేలు చేయటానికి అయినా సహేతుకత..శాస్త్రీయత ఏమీ ఉండాల్సిన అవసరం లేదా?.

కేవలం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చివరి మూడు నెలల్లో ఎడాపెడా పథకాలు ప్రకటించి ప్రజల సొమ్ము ఓటర్ల ఖాతాలో వేసి...గెలిస్తే సరిపోతుందా?. ఎన్నికల బరిలో నిలిచే అన్ని పార్టీలకు సమాన అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఉండాలంటే ఎన్నికల ఏడాదిలో కొత్తగా ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని..లేకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు రైతు రుణ మాఫీపై ఎన్నోమాటలు చెప్పిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలన పూర్తి కావస్తున్నా ఇంత వరకూ దాన్ని పూర్తి చేయలేదు. వాస్తవానికి రైతు రుణ మాఫీ విషయంలో చంద్రబాబు చెప్పింది వేరు..వాస్తవంలో జరిగింది వేరు. అదే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ రైతులకు ఏటా పది వేల రూపాయలు ‘రైతు రక్ష’ కింద ఇస్తానని చెబుతున్నారు.

ఇప్పుడే ఆ పథకం ఎందుకు తెరపైకి వచ్చింది?. రైతులు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు భావించి ఉంటే మరి గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఎందుకు ఆ మొత్తం ఇవ్వలేదు?. వీటికి సమాధానాలు ఉన్నాయా?. అర్హులైన పేదలు, రైతులు, డ్వాక్రా మహిళలకు సాయం చేయటాన్ని ఎవరూ ఆక్షేపించారు. కానీ ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రభుత్వమే ప్రజల సొమ్ముతో పొలిటికల్ గేమ్స్ ఆడటమే అభ్యంతరకరం. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ రాజకీయ పార్టీలు హామీలను ‘వేలంపాటలు’గా మార్చిన తీరు చూసిందే. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది.

Next Story
Share it