Telugu Gateway
Politics

యూపీలో ఫిఫ్టీ..ఫిఫ్టీ..కాంగ్రెస్ కు రెండు

యూపీలో ఫిఫ్టీ..ఫిఫ్టీ..కాంగ్రెస్ కు రెండు
X

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పొత్తులు తేలిపోయాయి. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు అయిన ఎస్పీ, బిఎస్సీ చెరో 38 సీట్లను పంచుకున్నాయి. మిగిలిన నాలుగు సీట్లలో రెండింటిని కాంగ్రెస్ కు కేటాయించాయి. మిగిలిన రెండు మరో మిత్రపక్షానికి ఇచ్చారు. అయితే ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందా?. లేక మరికొన్ని సీట్లలోనూ బరిలోకి దిగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే. అత్యంత కీలకమైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితం కావటం అంటే రాజకీయంగా ఆ పార్టీకి ఇది పెద్ద ఇబ్బందికర పరిణామంగా మారటం ఖాయం. ఎస్పీ, బిఎస్సీల పొత్తులను ఆ పార్టీ అగ్రనేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ఉమ్మడిగా వెల్లడించారు. ఎస్పీ, బిఎస్పీలు చారిత్రాత్మక పొత్తు పెట్టుకున్నాయని వెల్లడించారు. తమ పార్టీతో పొత్తుకు అంగీకరించినందుకు బీఎస్పీ అధినేత్రి మాయవతికి అఖిలేశ్‌ యాదవ్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఇరుపార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తాయని వెల్లడించారు. ఆర్‌ఎల్డీ పార్టీకి రెండు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బలం లేదని, అందుకే పొత్తు విషయమై వారితో చర్చించలేదని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేశాయని వారు అన్నారు. అయితే ఈ మధ్య తాము రాజకీయాల కోసం పెట్టుకోలేదని..కేంద్రంలోని బిజెపిని గద్దెదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జన్సీ ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని భోపోర్స్ స్కాం ఇంటికి పంపగా..ఇప్పుడు రాఫెల్ స్కామ్ మోడీ సర్కారును ఇంటికి పంపుతుందని మాయావతి వ్యాఖ్యానించారు.

Next Story
Share it