జనసేనలోకి బిజెపి ఎమ్మెల్యే!
ఏపీ బిజెపిలో కీలక వికెట్ పడింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బిజెపికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆకుల సోమవారం నాడు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆకుల జనసేనలో చేరటానికి నిర్ణయించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. ఆకుల సతీమణి జనసేనలో కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో ఆకుల పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.