బిల్లులు కట్టని ఏపీ సర్కారు..ఆగిన ఉద్యోగుల వైద్య సేవలు
ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద ప్రస్తుతం ఏపీలో ఆస్పత్రులు ఏవీ వైద్యం అందించటం లేదు. దీంతో ఉద్యోగులు..పెన్షనర్లు ప్రస్తుతం నానా తిప్పలు పడుతున్నారు. ఏపీ సర్కారు వ్యవహారం ఏపీ ఉద్యోగుల్లో పెద్ద కలకలం రేపుతోంది. ఉద్యోగులతోపాటు పెన్షనర్లు, జర్నలిస్టులకు ఇఛ్చిన హెల్త్ కార్డులపై కూడా ప్రైవేట్ ఆస్పత్రులు ఏవీ వైద్యం చేయటం లేదు. దీనికి ప్రధాన కారణం ఏపీ సర్కారు ఇప్పటికే అందించిన వైద్య సేవలకు గాను ఆస్పత్రులకు 150 కోట్ల రూపాయలకుపైనే బకాయి పడింది. ఇవి చెల్లిస్తే తప్ప..కొత్తగా సేవలు అందించలేమని ఆస్పత్రులు చెబుతున్నాయి. సర్కారు మాత్రం ఎవరైనా అత్యవసరం అయితే రీఎంబర్స్ మెంట్ మార్గాన్ని ఎంచుకోండి అని సలహా, సూచనలు ఇస్తోంది. కానీ సొంత డబ్బులతో వైద్యం చేయించుకుని ఎవరైనా రీఎంబర్స్ మెంట్ కోసం దరఖాస్తు పెడితే మాత్రం బిల్లుల్లో భారీ ఎత్తున ‘కోతలు’ పడుతున్నాయని ఉధ్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అదే ఈహెచ్ఎస్ కింద అయితే ఆయా ఆస్పత్రులే పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.
ఈ వైద్య సేవలకు గాను ఉద్యోగులు కూడా తమ వేతనాల నుంచి కొత్త మొత్తాన్ని చెల్లిస్తారు. సర్కారు అవసరం లేని చోట అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దుబారా చేస్తూ పనిచేసే ఉద్యోగుల విషయంలో ఇలా నిర్లక్ష్యం చేయటం సరికాదని కొంత మంది ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈహెచ్ఎస్ విషయంలో ప్రస్తుతం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందని..సర్కారు బిల్లుల చెల్లింపు మరింత జాప్యం చేస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నికల ముంగిట ఎడాపెడా వరాలు కురిపిస్తున్న చంద్రబాబు ఉద్యోగుల ఆరోగ్యాన్ని మాత్రం గాలికొదిలేశారని చెబుతున్నారు.
ఉద్యోగులకు..వాళ్ల కుటుంబాలకు ఓట్లు ఉండవా?. వాళ్లు ఓట్లు వేయరా? అని ఓ నేత వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఉద్యోగుల్లో అసంతృప్తి మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ సర్కారు పూర్తిగా ‘అప్పుల బండి’పైనే ఆధారపడి నడుస్తోంది. ఏ పని ముందుకు సాగాలన్నా అప్పు ఉండాల్సిందే. మరి అప్పులతో సాగే ఈ బండి ఆస్పత్రులకు బకాయి పడిన 150 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఎప్పుడు చెల్లిస్తుందో వేచిచూడాల్సిందే.