చంద్రబాబుకు ఊహించని షాక్...సిసోడియాపై వేటు
కేంద్ర ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ఆర్ పీ సిసోడియా బాధ్యతలు చేపట్టి నిండా ఏడాది కూడా పూర్తి కాకుండానే ఆయనపై వేటు పడింది. ఇలా జరగటం చాలా అరుదు. సిసోడియాను ఎవరూ ఊహించని రీతిలో పక్కకు తప్పించిన సీఈసీ..కొత్తగా ఈ బాధ్యతలను గోపాలక్రిష్ణ ద్వివేదికి అప్పగించింది. ఏపీలోని ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావటం...పలు విమర్శల నేపథ్యంలో సీఈసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో మూడు, నాలుగు నెలల్లో అత్యంత కీలకమైన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్నికలకు అంతా రంగం సిద్ధం చేస్తున్న సిసోడియా పై వేటు పడటం అధికార వర్గాల్లో కలకలం రేపింది.
సిసోడియా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్నిహితంగా ఉంటారని అధికార వర్గాల్లో పేరుంది. సీఈసీ తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కూడా ఈ పరిణామంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఏపీ ఎన్నికలు ఈ సారి గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగనున్నాయి. ఈ తరుణంలో ప్రతి చర్యా కీలకమే కానుంది.