Telugu Gateway
Politics

ఏపీకి అసలు ప్రత్యేక హోదా వచ్చే ఛాన్స్ ఉందా?!

ఏపీకి అసలు ప్రత్యేక హోదా వచ్చే ఛాన్స్ ఉందా?!
X

ఏపీకి ప్రత్యేక హోదా. అసలు ఆ ఛాన్స్ ఉందా?. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఇదే నినాదంతో ముందుకెళ్లబోతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి?. ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నందుకే కాంగ్రెస్ తో కలసి సాగుతామని చెబుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. ఎవరు ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే వారికే మద్దతు అని చెబుతున్నారు ప్రతిపక్ష నేత జగన్. ఇస్తే గిస్తే ప్రత్యేక హోదా ఇవ్వటానికి అత్యంత అనువైన పరిస్థితులు ఉన్నది ప్రస్తుత మోడీ జమానాలోనే. ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీ సొంత మెజారిటీతో అధికారంలో ఉంది. ఏపీకి బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే విభజన సమయంలో ఈ హామీని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి మూడున్నర సంవత్సరాలు మోడీ ప్రభుత్వంలో ఉండి మరీ ‘ప్యాకేజీ’ రాగం అందుకుని తర్వాత మళ్లీ హోదా బాట పట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మళ్లీ ‘ప్రత్యేక హోదా’ నినాదం జోరందుకుంటోంది. అయితే వాస్తవ పరిస్థితులు ఏంటి?.

వచ్చే ఎన్నికల్లో మోడీనే మళ్ళీ ప్రదాని బాధ్యతలు చేపడితే ‘ప్రత్యేక హోదా’ వచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేనట్లే. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలోని బిజెపి ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యంకాదని తేల్చేసింది. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల ప్రకారం బిజెపి తనంతట తాను పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేనట్లే కన్పిస్తోంది. అంటే అటు బిజెపికి అయినా..ఇటు కాంగ్రెస్ కు అయినా యూపీకీ చెందిన ఎస్పీ, బిఎస్పీల మద్దతు అత్యంత కీలకం అవుతుంది. వీటి మద్దతుతో నడిచే ఏ పార్టీ అయినా వెనకబడిన ఉత్తరప్రదేశ్ ను కాదని..ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే అంగీకరిస్తాయా?. అది జరిగే పనేనా?. మోడీకి మిత్రపక్షాలతో కలుపుకుని కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఇక నెక్ట్స్ ఛాన్స్ కాంగ్రెస్ పార్టీతో కూడిన యూపీఏది.

కాంగ్రెస్ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతంగా అధికారంలోకి రావటం కల్ల. మరి యూపీఏ భాగస్వామ్యపక్షాలకు మెజారిటీ వచ్చినా కలకూరగంపలాంటి సంకీర్ణంలో ‘ప్రత్యేక హోదా’ వంటి నిర్ణయం తీసుకోవటం సాధ్యం అవుతుందా?. ఎక్కడి వరకో ఎందుకు?. తమిళనాడులో యూపీఏ భాగస్వామిగా ఉన్న డీఎంకె అందుకు ఓకే చెబుతుందా?. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర నేతలు అంగీకరిస్తారా?. అంటే ఖచ్చితంగా అనుమానమే అని చెబుతున్నాయి అధికార వర్గాలు. మాకు పూర్తి మెజారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా సాధిస్తాం అని టీడీపీ చెప్పినా..వైసీపీ చెప్పినా ప్రజలను వంచించటమే తప్ప..అది జరిగే పనికాదని ప్రభుత్వంలోని కీలక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వటానికి అవసరమైన పారామీటర్స్ ఏవీ కూడా ఏపీకి అనుకూలంగా లేవని చెబుతున్నారు అధికారులు. మరి ప్రత్యేక హోదా రాజకీయం విషయంలో ఏపీ ప్రజలు ఎవరి మాట వింటారో..ఎవరి వైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it