Telugu Gateway
Politics

జాతీయ రాజకీయాల్లో గెలుపు ఎవరిది?

జాతీయ రాజకీయాల్లో గెలుపు ఎవరిది?
X

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. మరి గెలుపు ఎవరిది?. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విజయం సాధిస్తారా?. లేక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘ప్రజాస్వామ్య అనివార్యత’ అక్కరకు వస్తుందా?. కెసీఆర్ అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన ఊపులో ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కెసీఆర్ బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ అని చెబుతున్నారు. ఇందులో కేవలం ప్రాంతీయ పార్టీలే ఉంటాయని చెబుతున్నారు?. అసలు నిజంగా జాతీయ పార్టీల భాగస్వామ్యం లేకుండా ఇఫ్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందా?. అంటే ఏ మాత్రం లేదని చెప్పొచ్చు. కెసీఆర్ చెబుతున్నట్లు ప్రాంతీయ పార్టీలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటినా.. ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అనివార్యం అవుతుంది. అలాంటప్పుడు ఈ ఫెడరల్ ఫ్రంట్ సొంతంగా నిర్ణయాలు తీసుకుని..తమ ఏజెండా దేశ వ్యాప్తంగా అమలు చేస్తామంటే అవి చూస్తూ కూర్చుంటాయా?.

అసలు తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నదే 17 ఎంపీ సీట్లు. ఇందులో మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ దక్కించుకున్నా ఇన్ని తక్కువ సీట్లు ఉన్న పార్టీ కేంద్రంలో పెత్తనం చేయటం సాధ్యం అవుతుందా?. ఆదివారం నాడే కెసీఆర్ ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం అయ్యారు. మిగిలిన నేతలతో పోలిస్తే నవీన్ పట్నాయక్ తీరే వేరు. కెసీఆర్ మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఆమెతో ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సమావేశం అయ్యారు. ఇప్పటికైతే ఆమె తటస్థంగా ఉన్నారు. ఛాన్స్ దొరికితే వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని అయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నినాదం కేవలం ప్రధాని మోడీకి మేలు చేయటానికే అనే విమర్శలూ ఉన్నాయి. ఎంఐఎంతో కలసి పలు రాష్ట్రాల్లో ప్రచారం చేయటం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టాలనేది వీరి వ్యూహంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీంతోపాటు తెలంగాణ లో తన తనయుడు కెటీఆర్ ను నేరుగా ముఖ్యమంత్రి చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున తాను జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నందున తన తనయుడికి సీఎం పీఠం అప్పగించేసి లైన్ క్లియర్ చేయటానికి కూడా ఆయన దీన్ని వాడుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే కెటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసినందున తర్వాత సీఎం పదవి అప్పగిస్తే అప్పటికే కెటీఆర్ అన్ని రకాలుగా కుదురుకుంటాడన్నది కెసీఆర్ ఆలోచనగా ఓ సీనియర్ నేత తెలిపారు.

కొద్ది కాలం క్రితం ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ తో జతకట్టారు. యూపీఏతో కలసి ముందుకు సాగుతామని..ఇది తమకు ‘ప్రజాస్వామ్య అనివార్యత’ అని చెబుతున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించి కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ అధికారంలోకి వస్తే తనకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు ఆలోచనగా ఉంది. లేదంటే భవిష్యత్ లో చిక్కులు తప్పవనే భయంతోనే యూపీఏ కోసం ఆయన తంటాలు పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో జట్టుకట్టి చేసిన ప్రయోగం ఘోరంగా విఫలమవటం చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామంగా మారింది. త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో ఈ ఫ్రభావం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ టీడీపీ నేతల్లో అయితే ఉంది. అయితే చంద్రబాబుతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఒకింత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే అది మోడీని వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరం చేసే స్థాయిలో ఉందా? లేదా అంటే ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందే. ఇన్ని పరిణామాల మధ్య జాతీయ రాజకీయాల్లో ఎవరు విజేతగా నిలుస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది.

Next Story
Share it