Top
Telugu Gateway

టీఆర్ఎస్ ఆ రెండు హామీలకు మంగళం పాడిందా?!

టీఆర్ఎస్  ఆ  రెండు హామీలకు మంగళం పాడిందా?!
X

దళితులకు మూడెకరాల భూమి.. ఉచిత కెజీ టూ పీజీ ఎత్తేసినట్లేనా?. టీఆర్ఎస్ కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టో చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. ఏ పార్టీ అయినా ప్రతి ఐదేళ్ళకు ఓ సారి తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో చెబుతూ మేనిఫెస్టో ప్రకటిస్తాయి. అన్ని పార్టీలు చేసేది ఇదే. అయితే చెప్పిన వాటిలో కొన్ని అమలు చేస్తారు..మరికొన్నింటిని వదిలేస్తారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారు తమకు కలిగే ప్రయోజనాల ఆధారంగా మేనిఫెస్టోలో లేకపోయినా పలు కొత్త పథకాలను తెరపైకి తెస్తారు. అవి వారి అవసరాల కోసం. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో దళితులకు మూడెకరాల భూమి. కెజీ టూ పీజీ ఉచిత విద్య. ఈ రెండు హామీల అమలులో టీఆర్ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో గత ఎన్నికల సమయంలో ఇఛ్చిన అత్యంత కీలకమైన రెండు హామీలను విస్మరించారు. అత్యంత ఈ కీలకమైన హామీలను అమలు చేయదలచుకుంటే..జాప్యం అయినా సరే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాలి. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆ పని చేయలేదు.

అంటే గత ఎన్నికల్లో గెలుపునకు వాడుకున్న అత్యంత కీలకమైన హామీలు రెండింటిని టీఆర్ఎస్ పూర్తిగా విస్మరించినట్లు అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు కలసి మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ మరింత విస్తృత పరుస్తూ, కొనసాగిస్తామని తెలిపారు. దళితులకు భూమి అరకొరగా ఇచ్చారు కానీ...కెజీ టూ పీజీ ఉచిత విద్య అసలు పట్టాలెక్కలేదు. నిజంగా ఈ హామీలను అమలు చేయదలచుకుంటే వీటిని కూడా కొత్త మేనిఫెస్టోలో పెట్టి ఉండొచ్చు. కావాలనే వీటిని పక్కన పెట్టారని భావిస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టడం విశేషం.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో హామీలు..

- వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతాం. మిగిలిన అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీ 2018 వరకు పొడిగింపు.

- వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు.

- నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3,016 భృతి చెల్లింపు.

- డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉండి, అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం.

- రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.

- రైతులకు రూ.1 లక్ష వరకున్న పంట రుణాలు మాఫీ.

- రెతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి చెల్లింపు.

- ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.

- చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.

- ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మా నం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది.

- ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాం. కేంద్రం నుంచి ఆమోదం వచ్చేందుకు టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది.

- వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది. - రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు.

- వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.

- అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు అమలు..

- టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తుంది. ఈ యూనిట్లు తయారు చేసే ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.

- కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేసి, రాష్ట్ర హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తుంది.

- ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది.

- ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంపు. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగాల నియామక వయో పరిమితి మూడేళ్లు పెంపు.

- పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు..

- అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాల పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు.

- బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు..

- సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు..

- హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేస్తాం.

Next Story
Share it