Telugu Gateway
Telangana

క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ‘బేస్’ దెబ్బతిన్నదా?!

క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ‘బేస్’ దెబ్బతిన్నదా?!
X

తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించింది యువత..ఉద్యోగులే. కాకపోతే ఉద్యమాన్ని ముందుండి నడిపింది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పుట్టిన పార్టీ కనుక. మరి ఇప్పుడు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ‘బేస్’ భారీగా దెబ్బతిన్నదా?. అంటే అవునంటున్నారు రాజకీయ నిపుణులు. తెలంగాణ ముందస్తు ఎన్నికలను పురస్కరించుకుని ఢిల్లీకి చెందిన కొంత మంది నిపుణులు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి పలు అంశాలను తేల్చారు. ఇందులోని కీలక అంశాలు ‘తెలుగుగేట్ వే. కామ్’కు అందాయి. ముఖ్యంగా ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ వెంట నడిచిన యువత, ఉద్యోగులు ప్రస్తుతం టీఆర్ఎస్ కు దూరం జరగటంతో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఖచ్చితంగా టీఆర్ఎస్ పై ఉంటుందని వీరు చెబుతున్నారు.

తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయని..ఇంటికో ఉద్యోగం వస్తుందని కెసీఆర్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో యువతలో టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ ఆకాంక్షలు అన్నీ నెరవేరుతాయని ఉద్యోగులు భావించారు. కానీ రకరకాల కారణాలతో ఉద్యోగులు కూడా టీఆర్ఎస్ కు దూరం అయ్యారు. గతంలో ఎన్నడూలేని రీతిలో కెసీఆర్ కాంగ్రెస్ నిరుద్యోగ భృతి అనగానే తీవ్ర విమర్శలు చేసి మరీ..అదే స్కీమ్ కు మరో 16 రూపాయలు జత చేసి టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు వ్యవహారం కూడా అంతే. కాంగ్రెస్ 60 సంవత్సరాలు అంటే..కెసీఆర్ ఏకంగా 61 సంవత్సరాలుగా మ్యానిఫెస్టోలో పెట్టేశారు. ఇవి అన్నీ కూడా ఉద్యోగులు టీఆర్ఎస్ కు దూరం అయ్యారనే అంశాన్ని గుర్తించటం వల్లే అని వీరు విశ్లేషించారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి నాళ్ళలో పార్టీకి అండగా ఉన్న వారంతా దూరంగా జరగటంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీగా నష్టపోయే అవకాశం ఉందని వీరు అంచనా వేస్తున్నారు. పార్టీకి దూరం జరిగిన వర్గాలతో పోలిస్తే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంత వరకూ ‘కవర్’ చేస్తాయన్నది అనుమానమే అని ఈ నిపుణులు తేల్చారు.

దీనికి తోడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జిల్లాల వారీగా పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా పెద్దగా కసరత్తు సాగలేదని..అధిష్టానం దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల క్యాడర్ ను పట్టించుకోకపోవటం కూడా నష్టం చేయనుందని...అంతిమంగా ఒకప్పుడు టీఆర్ఎస్ కు అండగా నిలిచిన వారంతా ఇప్పుడు దూరం జరగటం వల్ల ‘ఫలితాలు’ ప్రతికూలంగా ఉంటాయని ఈ నిపుణులు తేల్చారు. ఇదే కారణంతోనే అటు కెసీఆర్, మంత్రులు కెటీఆర్, హరీష్ రావులు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అంశాన్ని ముందు పెట్టి ‘సెంటిమెంట్’ అస్త్రం కోసం ప్రయత్నిస్తున్నారని..ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందేనని చెబుతున్నారు. సిట్టింగ్ లు అందరికీ సీట్లు ఇవ్వటం కూడా టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా వీరు తేల్చారు.

Next Story
Share it