Telugu Gateway
Telangana

కెటీఆర్ కు లైన్ క్లియర్ చేస్తున్న కెసీఆర్!

కెటీఆర్ కు లైన్ క్లియర్ చేస్తున్న కెసీఆర్!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ తన తనయుడు, మంత్రి కెటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టేందుకు లైన్ క్లియర్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నాడు ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అవగతం అవుతోంది. రాబోయే రోజుల్లో తాను కేంద్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నట్లు..జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ నుంచే ఆ పని చేస్తానని కెసీఆర్ చెబుతున్నా కూడా...పార్లమెంట్ ఎన్నికల తర్వాతా..లేక ముందుగానే కెటీఆర్ కు సీఎం సీటులో కూర్చోపెడతారా? అన్న అంశం తేలాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల లోపుగానే తాను..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తామని..ఇందుకోసం ప్రత్యేకంగా విమానాలు కూడా సిద్ధం చేసుకున్నట్లు కెసీఆర్ వెల్లడించారు. ఇదంతా కెటీఆర్ కు పట్టాభిషేకం చేసే ప్లాన్ లో భాగమేనని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 15 కోట్ల మంది రైతులు ఉంటే, వారంతా అన్నమో రామచంద్రా అంటూ ఉన్నారని, ఈ దేశంలో 70వేల టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉన్నప‍్పటికీ 30 వేల టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవడం నిజంగా సిగ్గుచేటన్నారు.పార్టీ గెలిచిందని శ్రేణులు ఎవ్వరూ కూడా అతిగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ముఖ్యంగా వినయం, విధేయత అనేది అవసరమన్నారు. ఇది సకల జనులు తమకు అందించిన విజయంగా కేసీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గిరిజనులు, దళితులతో పాటు ప్రతీ ఒక్కరూ తమ భారీ విజయంలో సహకరించారన్నారు. ‘అంతిమ తీర్పు ప్రజలు అప్పగించారు కాబట్టి.. ఆ సమయాన్ని ప్రజా సేవచేయడానికి కేటాయించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఎదురుదాడులకు దిగినప్పటికీ అవన్నీ గతం. నేను ప్రజలకు చెప్పిందొకటే టీఆర్‌ఎస్‌ వస్తే కాళేశ్వరం వస్తది.. కూటమిని గెలిపిస్తే శనిశ్వరం వస్తది అని చెప్పిన. ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలంటూ తీర్పునిచ్చారు. తెలంగాణలో నిశ్చితంగా ధనిక రైతాంగం ఉందనేవిధంగా పనిచేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూములు కోసం కష్టపడుతున్నారు. ఇందుకు పరిష్కారం వచ్చే దిశగా ప్రయత్నిస్తా. కులవృత్తులు అన్నీ కుదుటపడే విధంగా చర్యలు చేపడతాం. యువతలో నిరుద్యోగ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఇది యావత్‌ దేశంలో ఉన్న సమస్యే.. కానీ యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు వచ్చేవిధంగా ముందుకు సాగుతాం. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్‌ను వేస్తాం. ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో ప్రజల సంపూర్ణ ఆరోగ్యం దిశగా కృషి చేస్తాం. దళితులు, గిరిజనుల పేదరికాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటాం. ఎవరి సమస్య అయినా సమస్యే కాబట్టి.. ప్రజాసమస్యలే కేంద్ర బిందువుగా పనిచేస్తాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Next Story
Share it