Telugu Gateway
Telangana

కారు జోరు...కూటమి బేజారు

కారు జోరు...కూటమి బేజారు
X

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ‘కారు’ జోరు చూపించింది. కూటమి కట్టి..ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని చూసిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ ఎన్నికల ఫలితాలతో బేజారు అయింది. ఊహించని స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఓటమి పాలు అవటం కాంగ్రెస్ పార్టీని షాక్ కు గురిచేసింది. తెలంగాణ తెచ్చిన పార్టీగా తొలిసారి టీఆర్ఎస్ కు అవకాశం ఇఛ్చిన తెలంగాణ ప్రజలు ఈ సారి తెలంగాణ ఇఛ్చిన పార్టీ అయిన కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుంటారని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ వీరి ఆశలు ఏ మాత్రం ఫలించలేదు. ఎన్నికలు కాస్తా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉంటాయనుకుంటే అవి కాస్తా కూటమికి వ్యతిరేకంగా ఉండటంతో అవాక్కు అవటం కూటమి నేతలు వంతు అయింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు దక్కించుకుని అప్రతిహత విజయాన్ని అందించుకుంది. అయితే కొంత మంది మంత్రులు ఓటమి పాలు అవటం టీఆర్ఎస్ పార్టీని కూడా విస్మయానికి గురిచేసింది. కూటమి కేవలం 21 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తెలంగాణ ఎన్నికల్లో తమ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని గంభీర ప్రకటనలు చేసిన బిజెపి చావుదెబ్బ తినాల్సి వచ్చింది. ఆ పార్టీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలింది. ఏకంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ తోపాటు సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా ఓటమి బాట పట్టారు. గత అసెంబ్లీలో ఉన్న సీట్లను కాపాడుకోవటంలో కూడా బిజెపి విఫలం అయింది. బిజెపి తరపున తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీతోపాటు..బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు.

అయినా పెద్దగా ఫలితం చూపించలేకపోయారు. ఇదిలా ఉంటే కూటమి తరపున ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించటం పెద్ద దెబ్బగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే విన్యాసాలు కూడా కూటమికి భారీ నష్టం చేకూర్చాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధితోపాటు ఖమ్మం జిల్లాల్లోనే ప్రచారానికి పరిమితం చేసిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజా ఫలితాలతో కాంగ్రెస్ తీవ్ర ద్రిగ్భాంతికి గురైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు, లగడపాటి ప్రచారాంశాలు టీఆర్ఎస్ గెలుపును సులభం చేశాయని చెబుతున్నారు. దీనికి తోడు అధికార పార్టీకి పలు అంశాలు కలసి వచ్చాయి.

Next Story
Share it