Telugu Gateway
Telangana

కెసీఆర్ ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు

కెసీఆర్ ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు
X

తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రానికి రెండవ సారి ముఖ్యమంత్రిగా కెసీఆర్ గురువారం మధ్యాహ్నాం 1.00 గంటకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగనుంది. సీఎం కెసీఆర్ తోపాటు కొంత మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరు ఎవరెవరు?.తొలి జాబితాలో ఎంత మంది ఉంటారు అన్నది బుధవారం సాయంత్రానికి తేలనుంది.

పాత, కొత్తల కలయికగా కేబినెట్ కూర్పు ఉంటుందా?. లేక పూర్తిగా పాత వారితోనే ఉంటుందా? అన్న విషయం తేలాల్సి ఉంది. బుధవారం హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభాపక్ష సమావేశంలో కెసీఆర్ ను పార్టీ నేతగా ఎన్నుకోవటం లాంఛనంగా పూర్తి కానుంది. ఎన్నికల సంఘం కూడా ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను గవర్నర్ నరసింహన్ కు అందజేసే ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇది జరిగిన వెంటనే గెజిటి నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. తొలి దశలో సీఎం కెసీఆర్ తోపాటు కేవలం ఒక్క మంత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు.

Next Story
Share it