జగన్ కు సొంత మైకు కెసీఆర్

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తెలంగాణ సీఎం కెసీఆర్ పై తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసీఆర్ ప్రధాని మోడీకి అద్దె మైకు...వైసీపీ నేత జగన్ కు సొంత మైకులా మారారాని ధ్వజమెత్తారు. ‘‘నువ్వు ఆడిన మాట తప్పని మహా నాయకుడివి! మాట కోసం తలమీద మెడ కూడా నరుక్కుంటావ్! దళితుడినే తెలంగాణకు సీఎం చేశావు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ పాతబస్తీలను న్యూయార్క్, డల్లాస్, ఇస్తాంబుల్‌గా మార్చేశావ్. తెలంగాణ ఇస్తే కాంగ్రె్‌సలో టీఆర్‌ఎ్‌సను విలీనం చేసేస్తానని చేసేశావ్!’’ అంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబును ప్రశంసిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం తాలూకు వీడియోను చూపించారు.
‘‘సంపద ఎలా పెంచాలో చంద్రబాబుకు తెలుసు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో బడ్జెట్ రూ.10వేల కోట్లే. కానీ చంద్రబాబుదానిని రూ.50వేల కోట్లకు బడ్జెట్‌ను తీసుకెళ్లారు. సంపద పెంచింది చంద్రబాబు. ఎంజాయ్ చేసింది రాజశేఖర్‌రెడ్డి. చంద్రబాబుపై వైఎస్ మాట్లాడే భాష సరికాదు’’ అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కేసీఆర్ మోదీ దూతగా మాట మార్చారని సోమిరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మొన్నటి తెలంగాణ ఎన్నికల సభలో సోనియాగాంధీ చెప్పగానే... దీనిపై రాహుల్ వివరణ ఇవ్వాలని, అసలు హోదా ఎలా ఇస్తారని హరీశ్ మండిపడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఏపీకి హోదా ఇవ్వాలని లేఖ కేసీఆర్ లేఖ రాస్తామంటున్నారని అన్నారు.
ఆర్థిక అంశాల గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నారు. ‘‘14వ ఆర్థికసంఘం లెక్క వేసినదానికంటే ఏపీకి మూడేళ్లలో ఆదాయం రూ.36వేల కోట్లు లోటు వచ్చింది. అయినా వ్యవసాయ-అనుబంధ రంగాల్లో ఏపీ 11 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణలో ఇది 2.9శాతం మాత్రమే! ఆర్థిక వృద్దిరేటులో ఏపీ దేశంలోనే ముందుంది. తెలంగాణ ఎక్కడుంది?’’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 50 అంతస్తుల్లో ప్రభుత్వ కార్యాలయ సముదాయాన్ని, ర్యాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారని... ఇది అక్షరాలా నిజమని తెలిపారు. ‘‘కేసీఆర్ రూ.300 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఏపీ రాజధానికి మాత్రం రూ.1500కోట్లు సరిపోతుందట! ఏపీ చెడు కోరుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం’’ అని విమర్శించారు. హైదరాబాద్‌నుంచి వచ్చే ఆదాయంతోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తెలిపారు.
‘‘ప్రజలు చంద్రబాబును ఓడిస్తారని కేసీఆర్ అంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం అన్నింటిలో మేం ముందున్నాం. మిమ్మల్నే అలా గెలిపిస్తే మమ్మల్నెలా గెలిపిస్తారో రేపు చూడు’’ అని సోమిరెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపతాల్రు చదివి... అందులో లోపాలుంటే చెప్పాలన్నారు. ‘‘దేశాన్ని పాలించే ప్రభుత్వం నుంచి బయటికి వచ్చినవాళ్లం మేం! నిజంగా పోరాటం చేసే నా యకుడు చంద్రబాబు. మోదీపై దేశంలో తిరగబడ్డ మొ దటి నాయకుడు ఆయన. మీలా బయటికి తిట్టి లోపల లాలూచీ పడటం లేదు’’ అని సోమిరెడ్డి విమర్శించారు.
చంద్రబాబును ఎదుర్కోవడం జగన్ వల్ల కాదని... కేసీఆర్‌ను మోదీ రంగంలోకి దించారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కేసీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని... మోదీ బిస్కట్లకు కక్కుర్తిపడి ఈ పని చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు విభజనకు వ్యతిరేకమైతే భవనాలు ఎందుకు కడతామని ప్రశ్నించారు. నోటిఫికేషన్ తర్వాత తగిన సమయం ఇవ్వలేదన్నదే తమ అభ్యంతరమన్నారు. జగన్ కోసం మోదీ దగ్గరకు రాయబారిగా వెళ్ళి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో జోకర్‌గా మిగిలారని విమర్శించారు. ఎదుటి వారి సహనానికి హద్దు ఉంటుందని మర్చిపోవద్దని సూచించారు. చంద్రబాబు లక్ష్యంగా మోదీ విదిల్చిన డబ్బు సంచుల కోసం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోదీ ఆడిస్తున్న తోలుబొమ్మ, కీలుబొమ్మ కేసీఆర్ అని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2019లో టీడీపీ తిరుగులేని మేజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
జగన్, మోదీలతో కలిసి నాటకం ఆడి చంద్రబాబును ఓడిస్తా అనుకుంటున్నావు. ధైర్యముంటే జగన్, మోదీలతో పొత్తుపెట్టుకుని రా! నువ్వన్న ప్రతిమాటకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. లేకుంటే ఏపీలో ఒంటరిగా పోటీచెయ్. ఒక్క చోట అయినా డిపాజిట్ తెచ్చుకోగలవా?’’ అని ఆనంద్‌బాబు సవాల్ చేశారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు చలువే అని కేటీఆర్ చెప్పారని ఆనంద్ బాబు గుర్తు చేశారు. ‘‘2009లో పొత్తుకోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావు. 2014లో సోనియా కాళ్లు పట్టుకున్నావు. ఇప్పుడు మోదీ పంచన చేరావు. కేసీఆర్ మాట్లాడిన గలీజు భాష మాకూ వచ్చు. కానీ... మాకు సభ్యత ఉంది. మళ్లీ ఇలా మాట్లాడితే... ఖబడ్దార్ అని హెచ్చరించారు.