చంద్రబాబు సభలో నిరసనలు
ఉద్యోగాలు కోరుతూ నిరుద్యోగులు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సభలోనే నిరసనలకు దిగారు. దీంతో తిరుపతి సభలో కొద్దిసేపు కలకలం రేగింది. నిరసనలు తెలిపే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి..ప్రభుత్వం మాట తప్పిందని..తమకు మెగా డీఎస్సీ కావాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ ఘటన సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో జరగటం విశేషం. తిరుపతిలో గురువారం చంద్రబాబు పాల్గొన్న సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి మరీ నినాదాలు చేశారు. వీరిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు నిర్లక్ష్యంగా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారనీ, సంయమనం పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 12,900 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఏడువేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.