Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘సిలికాన్ సిటీ’

ఏపీలో ‘సిలికాన్ సిటీ’
X

తిరుపతిలో ప్రతిష్టాత్మక సంస్థ టీసీఎల్ నిర్మించతలపెట్టిన టీవీల తయారీ యూనిట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ 2200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ యూనిట్ ద్వారా ఏటా 60 లక్షల టీవీలు తయారు చేయనున్నారు. ఈ సంస్థ ద్వారా కొత్తగా ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ హైదారాబాద్ లో సైబరాబాద్ మోడల్ లోనే ఏపీలో సిలికాన్ సిటీని డెవలప్ చేయనున్నట్లు వెల్లడించారు. నెల్లూరు-తిరుపతి-చెన్నయ్ ల మధ్య ఏర్పాటు అయ్యే ఇండస్ట్రీయల్ కారిడార్ కు ఈ పేరు పెడుతున్నట్లు తెలిపారు. 2019 డిసెంబర్‌ నాటికి టీసీఎల్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో చిత్తూరుకు అనేక కంపెనీలు తరలివస్తాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని బాబు తెలిపారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్‌లో ఉందన్నారు. దేశానికి తిరుపతి ఆదర్శంగా నిలుస్తోందని, తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీ హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారనుందని తెలిపారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 20 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న షెంజెన్ నగరం తరహా వాతావరణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో మొత్తం 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. ఇక్కడ లక్ష ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు.

Next Story
Share it