Telugu Gateway
Telangana

చంద్రబాబుకు షాక్

చంద్రబాబుకు షాక్
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇది పెద్ద షాక్. ఓ వైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయి..కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న ఆయనకు ఇది ఏ మాత్రం మింగుడుపడని పరిణామం. ఈ ప్రభావం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలపై ఉండటం కూడా ఖాయంగా కన్పిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి మహాకూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. పైగా తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాదు...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి మరీ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతిలో తన పాత్ర కూడా చాలా ఉందని అంటూ ప్రచారం చేశారు. అయితే మహాకూటమి ఏర్పాటే కెసీఆర్ కు ఓ వరంగా మారినట్లు కన్పిస్తోంది.

దీన్నే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఓ అస్త్రంగా చేసుకుని ముందుకు సాగారు. మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకుంటే నష్టపోయేది తామేనని..ఆలోచించి ఓటు వేయాలని కోరటం ద్వారా తెలంగాణ ప్రజలపై కెసీఆర్ ప్రయోగించిన అస్త్రాలు ఫలించినట్లు ఉన్నాయి. ఏతా వాతా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుని ఇరకాటంలో పడినట్లు అయింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కెసీఆర్ ఏపీ రాజకీయాల విషయంలో ప్రతిపక్ష నేత జగన్ కు పరోక్ష సాయం అందించటం ఖాయంగా కన్పిస్తోంది. తెలంగాణ ఎన్నికల విషయంలో అతి జోక్యం ద్వారా చంద్రబాబు తెలంగాణతోపాటు ఏపీలో కూడా దెబ్బతినే పరిస్థితి కన్పిస్తోంది.

Next Story
Share it