Telugu Gateway
Andhra Pradesh

ఓటుకు నోటులో వదిలేశారు..అనుభవించండి

ఓటుకు నోటులో వదిలేశారు..అనుభవించండి
X

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబును వదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే చంద్రబాబు కెసీఆర్ నెత్తినెక్కి కూర్చున్నాడని అన్నారు. రోజా ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునిచ్చిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదే మాట ఏపీలో కూడా చెప్పగలరా? అని రోజా ప్రశ్నించారు. ఏపీలో ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే అభివృద్ధి చూసి వచ్చారు అంటావ్‌..మరి తెలంగాణలో పార్టీ మారితే నీతి బాహ్యమా అని అడిగారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు వెర్రివాళ్లు కాదు చంద్రబాబు చెప్పే మాటలు విని ఓటు వేయడానికి అన్నారు. వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌ కల్యాణ్‌కి లేదని అన్నారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నపుడు పవన్‌ కల్యాణ్ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ అసెంబ్లీకి రారు..హిందూపూర్‌కి వెళ్లరు కానీ తెలంగాణాలో ప్రచారానికి మాత్రం వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు, వారిని మంత్రుల్ని చేసినపుడు లేవని నోరు ఇప్పుడెలా లేస్తుందని బాలకృష్ణను ప్రశ్నించారు. టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంటే మీ నందమూరి కుటుంబం పౌరుషం ఏమైందని అడిగారు. నందమూరి సుహాసినిని కూడా కరివేపాకులా వాడుకుంటున్నారని, ఓడిపోయే స్థానం కట్టబెట్టి ఆమెని బలిపశువుని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Next Story
Share it