టీడీపీలో పదవులుంటాయి..పవర్స్ ఉండవు
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి..జనసేన లో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో పదవులు ఉంటాయి కానీ...ఎలాంటి పవర్స్ ఉండవని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం నాడు విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో రాజకీయాలు అవినీతి, దుర్మార్గాలతో నిండిపోయాయని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం దోపిడీస్వామ్యం, సారాస్వామ్యంగా మారిందని అన్నారు. ఆత్మాభిమానాన్ని
చంపుకోలేక టీడీపీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. టీడీపీలో ఉండగా సైధ్దాంతిక విభేదాలతో ఎంతగానో నలిగిపోయానని వెల్లడించారు. ఆత్మగౌరవాన్ని చంపులేకపోయానని అందుకే టీడీపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. కులం పట్టింపులు లేని సమాజం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని, ఆయన చేస్తున్న పోరాటంలో సమిధగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు.