Telugu Gateway
Politics

రాజస్థాన్ లో హస్తం హవా..మధ్యప్రదేశ్ లో నువ్వా నేనా?

రాజస్థాన్ లో హస్తం హవా..మధ్యప్రదేశ్ లో నువ్వా నేనా?
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడికాబోతున్నాయి. అయితే ఏ రాష్ట్రం ఎవరు దక్కించుకుంటారు?. బిజెపి తన జోరు కొనసాగిస్తుందా?. కాంగ్రెస్ తిరిగి పునర్ వైభవం దిశగా సాధిస్తుందా?. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపించటం ఖాయం. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ హవా వీస్తున్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 41 శాతం, బీజేపీకి 40 శాతం మేర ఓట్లు పోల్‌ కావచ్చని ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది.

రాజస్ధాన్ విషయంలో అన్ని జాతీయ ఛానల్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేల్చాయి. టైమ్స్ నౌ అంచనా ప్రకారం రాజస్థాన్ లో కాంగ్రెస్ 105 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని..బిజెపి 85 సీట్లకు పరిమితం అవుతుందని పేర్కొంది. ఇండియా టుడే మాత్రం కాంగ్రెస్ కు 119 నుంచి 141 వరకూ సీట్లు వస్తాయని..బిజెపికి 55-72 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ కాంగ్రెస్ కు 129-145 సీట్లు దక్కించుకోవచ్చని పేర్కొంది. అదే బిజెపికి 52 నుంచి 68 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యప్రదేశ్ కు వచ్చేసరికి కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ నిలబడినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మరి అంతిమ ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it