ఇళ్లు కట్టకుండానే తలుపులు పెట్టి ఫుల్ పేజీ ప్రకటనలు!
ఎవరైనా కొత్తగా కట్టుకున్న ఇళ్లు పూర్తయితే సంతోషంగా ఉంటారు. అందరినీ పిలిచి గృహ ప్రవేశం చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అందులో వింత ఏమీ లేదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాత్రం పునాదికి ఓ పండగా..ఇటుక ఇటుక కు ఓ ఉత్సవం..శ్లాబ్ కు ఓ ఈవెంట్, ఇప్పుడు తలుపులు పెట్టడానికి కూడా కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో పత్రికలకు ఫుల్ పేజీల ప్రకటనలు. ఇది అంతా పోలవరం ప్రాజెక్టులో సాగుతున్న తంతు. ఒక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపు చంద్రబాబునాయుడు కనీసం ఓ యాభై ఈవెంట్లు చేసేలా ఉన్నారు. ఎందుకంటే పని కంటే ఆయనకు ప్రచారం ముఖ్యం. ఏ వైపు కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు నిదులు ఇవ్వటం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును ఇలా పేజీలకు పేజీల ప్రకటనల కోసం...ఈవెంట్స్ నిర్వహణకు కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటని అధికార వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీకి అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు మొదటి స్పిల్ వే గేటు స్థాపన అంటూ సోమవారం నాడు పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా మొత్తం 48 గేట్లు అమర్చాల్సి ఉండగా..మొదటి స్పిల్ వే గేటు ఏర్పాటు కోసం ఇంత హంగామా చేయటం చూసి ప్రభుత్వ వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టును చూపించటం ద్వారానే వచ్చే ఎన్నికల్లో గెలుపునకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు. అందుకే అన్ని నియోజకవర్గాల నుంచి రైతులను బస్సుల్లో రప్పించి మరీ వారికి పోలవరం ప్రాజెక్టు పురోగతి చూపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగే అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.