Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘పెథాయ్’ బీభత్సం

ఏపీలో ‘పెథాయ్’ బీభత్సం
X

వరస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. తాజాగా ఏపీని తాకిన ‘ఫెథాయ్’ తుఫాన్ తో రాష్ట్రంలోని రైతాంగం భారీగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. పంట చేతికొచ్చే వేళ ఏపీని కమ్మేసిన పెథాయ్ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లనుంది. తుఫాన్ కారణంగా జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. విజయవాడ, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ విమాన సర్వీస్‌లను కూడా నిలిపివేశారు. బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్‌ ఏసియా విమానం బోర్డింగ్‌ పాస్‌లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఢిల్లీ - విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగా చెన్నై - విశాఖ విమానం తిరిగి చెన్నైకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ - విశాఖ స్పైస్‌జెట్‌ విమానాన్ని రద్దు చేయడమే కాక.. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విమానాల రద్దుతో దాదాపు 700 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు గాస్తున్నారు. అంతేకాక తుపాను ప్రభావం దృష్ట్యా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ ప్రభావం కారణంగా కాకినాడపై పెనుగాలులు విరుచుకుపడుతున్నాయి. ఈ దెబ్బకు కాకినాడ వణికిపోతోంది. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాకినాడ-యానాం వద్ద పెథాయ్ తుఫాన్ తీరాన్ని తాకింది.

Next Story
Share it