‘పడి పడి లేచే మనసు’ మూవీ రివ్యూ
శర్వానంద్. సాయి పల్లవి. ఇద్దరూ మంచి డెప్త్ ఉన్న నటులు. వీళ్ళిద్దరూ కలసి సినిమా అంటే సహజంగానే యూత్ లో ఆసక్తి పెరగటం సహజం. అందునా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా టీజర్..ట్రైలర్ లే పడి పడి లేచే మనసుపై అంచనాలు మరింత పెంచేశాయి. వెండి తెరపై ప్రేమ కథలు ఎన్నో. కానీ చాలా మంది దర్శకులు అదే ప్రేమలో ఏదో ఒక కొత్తదనం చూపించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా కూడా. ప్రేమ ఓకే..కానీ పెళ్ళి వద్దు అంటే ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుందా?. అది అంతా ఈజీగా ముందుకెళుతుందా?. అదే తిరకాసుతో ఈ సాగుతుంది సినిమా. ప్రేమలో పడటం ఎవరికైనా సహజమే. ఒకే అమ్మాయి..ఒకే అబ్బాయి వెరైటీగా రెండుసార్లు ప్రేమలో పడటమే ఈ సినిమాలో కొత్తదనం. ఈ సినిమాలో ప్రేమ కథకు సంబంధించి నేపాల్, కోల్ కతా లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
శర్వానంద్ ఈ సినిమాలో మరోసారి తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్, లవ్ సీన్స్ తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ సత్తా చాటాడు. సాయి పల్లవి కూడా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో నటించింది. శర్వా, సాయి పల్లవిల నటన సినిమా స్థాయిని పెంచింది. ఇద్దరు నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్ ను కట్టిపడేశారు. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగటంతో ఇతర పాత్రలకు అంత ప్రాధాన్యత లేదనే చెప్పాలి. అయితే ప్రియదర్శి, సునీల్, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు. హను రాఘవపూడి మరోసారి తన మార్క్ పొయటిక్ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
కథా కథనాలు కాస్త నెమ్మదిగా సాగిన విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నీ తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా తెరకెక్కించి ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు కొంత ఇబ్బంది పడినట్లు కన్పిస్తుంది. సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్ మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తాయి. ఓవరాల్ గా చూస్తే పడి పడి లేచే మనసు సినిమా యూత్ ను ఆకట్టుకునే వినూత్న ప్రేమ కధ.
రేటింగ్. 2.75/5