Telugu Gateway
Andhra Pradesh

‘భోగాపురం’ విమానాశ్రయానికి మరో బ్రేక్

‘భోగాపురం’ విమానాశ్రయానికి మరో బ్రేక్
X

కేంద్రం నిర్ణయంతో ప్రైవేట్ సంస్థలు రాక అనుమానమే!

ఆంధ్రప్రదేశ్ లో నిర్మించతలపెట్టిన తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి మరో బ్రేక్ పడింది. ఈ విమానాశ్రయం రెడీ అయినా సరే..విశాఖపట్నంలోని విమానాశ్రయాన్ని యధావిధిగా కొనసాగిస్తామని కేంద్రం తేల్చింది. దీంతో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించే భోగాపురం విమానాశ్రయం ఏ మాత్రం లాభదాయకంగా ఉండదు. దీంతో ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసే సమయంలోనే నూతన విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం కాగానే..బేగంపేట విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ఉండకూడదనే నిబంధన పెట్టారు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో ఏపీలోని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టు ఏ మేరకు ముందుకు కదులుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం టెండర్ దక్కించుకున్న ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ఏపీ సర్కారు ప్రాజెక్టు అప్పగించి ఉంటే బహుశా ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కావేమో. కానీ మారిన పరిస్థితుల్లో కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్టును ఇరకాటంలో పడేయనుంది.

విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ లో విమానాల రాకపోకలు యధావిధిగానే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా రాజ్యసభలో స్పష్టం చేశారు. భోగాపురంలో కొత్తగా తలపెట్టిన అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్‌ కమిటీ ఈ నవంబర్‌ 26న జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలాంటి మేజర్‌ ఎయిర్‌పోర్ట్‌ ను మూసేయడం వలన దానిపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని, అందుకే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ లో విమానాల రాకపోకలను కొనసాగించాలని స్టీరింగ్‌ కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏఏఐఈ సమాచారాన్నిఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడీసీఎల్‌)కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.భోగాపురంం విమానాశ్రయం పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేయాలని తలపెట్టినందున విశాఖ విమానాశ్రయం యధావిధిగా కొనసాగిస్తే కొత్త ప్రాజెక్టు ఏ మాత్రం లాభదాయకం కాదనే విషయం తెలిసిందే. ప్రభుత్వం వీజీఎఫ్ కింద ఎంత సాయం చేసినా కూడా ప్రాజెక్టు ముందుకు సాగటం అనుమానమే అని చెబుతున్నాారు. ప్రైవేట్ విమానాశ్రయాలతో పోలిస్తే ఏఏఐ విమానాశ్రయాల్లో పార్కింగ్ ఛార్జీలతోపాటు అన్ని ఛార్జీలు తక్కువగానే ఉంటాయి. విమానయాన సంస్థలు కూడా వీటివైైపే మొగ్గుచూపుతాయి కానీ..ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసిన వాటి వైపు రావు.

Next Story
Share it