Telugu Gateway
Telangana

ఆ డెబిట్ కార్డులు చెల్లవిక

ఆ డెబిట్ కార్డులు చెల్లవిక
X

కొత్త సంవత్సరం..కొత్త కార్డులు తప్పదు. పాత డెబిట్ కార్డులు చెల్లవిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ఆదేశాల మేరకు దేశంలోని పలు బ్యాంకులు తమ డెబిట్ కార్డులను మరింత సురక్షితంగా మార్చి కస్టమర్లకు జారీ చేస్తున్నాయి. దీని కోసం ఆర్ బిఐ బ్యాంకులకు చాలా సమయం ఇచ్చింది. ఈ గడువు 2018 డిసెంబర్ తో ముగియనుంది. ప్రస్తుతం విరివిగా వినియోగంలో ఉన్న మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 తర్వాత నుంచి చెల్లుబాటు కావు. జనవరి 1 నుంచి యూరో పే, మాస్టర్‌కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్‌ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. పాత కార్డుల స్థానంలో కొత్త చిప్‌ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ మేరకు వినియోగదారులకు అన్ని బ్యాంకులు సందేశాలు కూడా పంపాయి. ఇప్పటికీ 70 శాతం మంది ఖాతాదారులు మాత్రమే కొత్త కార్డులు అందినట్లు సమాచారం.

పాత మ్యాగ్నటిక్ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో కొత్త చిప్‌ కార్డులను ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ వంటి బ్యాంకులు చాలా వరకూ ఉచితంగానే అందిస్తున్నాయి. గడిచిన ఏడాదికాలంగా ఒక్కసారి కూడా కార్డును ఉపయోగించని వారు మాత్రం తమ తమ హోం బ్రాంచీల్లో సంప్రదించి కొత్త చిప్‌ కార్డులను పొందవచ్చని ఎస్‌బీఐ చెబుతోంది. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా 99 కోట్ల డెబిట్‌ కార్డులు, 4.2 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఖాతాదారులు మోసాల బారిన పడకుండా కాపాడే క్రమంలో 2015 సెప్టెంబర్‌ నుంచే చిప్‌ ఆధారిత, పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌(పిన్‌)తో పనిచేసే డెబిట్, క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలంటూ అదే ఏడాదిలో ఆర్‌బీఐ ఆదేశించింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను మరికొన్ని నెలలు పాటు పొడిగించడంతో 2016 జనవరి తర్వాత నుంచి కొత్తగా ఖాతాలు తెరిచిన వారందరికీ చిప్‌ ఆధారిత డెబిట్‌ కార్డులనే బ్యాంకులు జారీ చేస్తున్నాయి.

Next Story
Share it