మధు యాష్కీకి కవిత లీగల్ నోటీసు

తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నేఫథ్యంలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు..ప్రత్యారోపణలే కాకుండా వ్యవహారం లీగల్ నోటీసుల వరకూ వెళుతోంది. తమ కుటుంబంపై ఇష్టానుసారం మాట్లాడిన మాజీ ఎంపీ మధు యాష్కీకి లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు. తమకు భేషరతు గా క్షమాపణ చెప్పాలని..లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్ నేత మధుయాష్కీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
తన వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ పరపతి దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తనపై భర్తపై ఆధారాలు లేని అవాస్తవాలు, ఆరోపణలు చేయడం విచారకరమని అన్నారు. తన పట్ల, తన భర్త పట్ల వాడిన అసభ్య పదజాలాన్ని వాపస్ తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.