Telugu Gateway
Politics

కేంద్రంలో మళ్ళీ మోడీనే..ఏపీలో వైసీపీకి ఛాన్స్

కేంద్రంలో మళ్ళీ మోడీనే..ఏపీలో వైసీపీకి ఛాన్స్
X

దేశ వ్యాప్తంగా ఓ సంస్థ సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన అభిప్రాయం ఇది. అయితే గత ఎన్నికల తరహాలో పూర్తి స్థాయి మెజారిటీతో అధికారం దక్కించుకుంటారా? లేక అతి పెద్ద పార్టీగా అవతరిస్తారా? అన్నది మాత్రమే తేలాల్సి ఉంది. వీటన్నింటికి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో జరిగే పరిణామాలే తుది ఫలితాన్ని తేల్చనున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు కుదిరితే ఎన్డీయే వచ్చే ఎన్నికల్లో 247 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని సీ-ఓటర్ అభిప్రాయ సేకరణ తేల్చింది. లేదంటే ఎన్డీయేకు 291 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్డీయే 247 సీట్ల వద్ద ఆగిపోతే ప్రభుత్వ ఏర్పాటుకు అప్పుడు కొత్త భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే దక్షిణ భారత దేశంలో మాత్రం బిజెపి ఎదురుగాలి ఎదుర్కోనుంది. ఈ ప్రాంతంలో యూపీఏ పక్షాలు మంచి మెజారిటీ సాధించే అవకాశం ఉందని సీ ఓటర్ ప్రజాభిప్రాయంలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ 14 ఎంపీ సీట్లు, టీడీపీ 11 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. వైసీపీ ఓటు బ్యాంకు 41.6 శాతంగా, యూపీఏ ఓటు బ్యాంకు 38.2 శాతంగా, ఎన్డీయే ఓటు బ్యాంకు 11 శాతం, ఇతరుల ఓటు బ్యాంకు 9.3 శాతంగా సీ ఓటర్ తేల్చింది. . ఉత్తరప్రదేశ్ లో విపక్షాల పొత్తు విజయవంతం అయితే బిజెపికి గతంలో వచ్చిన ఎనభై సీట్లు రావు. కేవలం 30 లోపు సీట్లే వస్తాయని అంచనా వేశారు.డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఈ అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో యూపీకి చెందిన పార్టీలు చక్రం తిప్పటం ఖాయంగా కన్పిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న మద్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ బిజెపినే ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకోవచ్చని సీ ఓటర్ పేర్కొంది. తాజా అంచనాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో భాజపా 23 గెలుచుకోనుంది. రాజస్థాన్‌లోని 25 సీట్లలో 19 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో ఐదింటిని దక్కించుకుంటుంది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ బలంగా ఉంది. ఒడిశాలోని 21 స్థానాల్లో 15, బిహార్‌లోని 40 స్థానాల్లో 35 గెలుచుకోనుంది. పశ్చిమ బెంగాల్ లోని 42 సీట్లలో 9 సీట్లు దక్కుతాయి. గుజరాత్‌లోని 26 స్థానాల్లో భాజపా 24 గెలుచుకోనుంది. మహారాష్ట్రలో ఆ పార్టీకి 18 స్థానాలే వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Next Story
Share it