కడపలో చంద్రబాబు ‘ఉత్తుత్తి ఉక్కు ప్లాంట్’
కడప స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ భాగస్వామి ఎవరు?. ఇనుప ఖనిజం సరఫరా ఒప్పందాలేవీ?. సాంకేతిక పరిజ్ణానం టై అప్ ఉందా?. అసలు ఓ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా స్టీల్ ప్లాంట్ పెట్టగలదా?. ఏపీలో ఉన్న ఇనుప ఖనిజాలు స్టీల్ ప్లాంట్ అవసరాలకు సరిపడతాయా?. అంటే ఏ మాత్రం సరిపోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సొంతంగా స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం అవుతుందా?. అంటే అది జరిగే పనికాదని అధికారులు తేల్చేస్తున్నారు. స్టీల్ మార్కెట్ లో ఒడిదుడుకులు...ఇనుప ఖనిజం సరఫరా సమస్యలు. ఇవన్నీ పట్టించుకోకుండా ఓ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పెట్టగలదా?. అసలు ఎందుకీ ప్రయత్నం? అంటే కారణం సింపుల్. మరో నాలుగు నెలల్లో ఎన్నికల రాబోతున్నాయి. రాయలసీమ ప్రజలను స్టీల్ ప్లాంట్ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాలు. అందుకే ఇది ‘ఉత్తుత్తి శంకుస్థాపన’ తప్ప..వాస్తవంగా జరిగేది ఏమీ ఉండదు అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
మరి నిజంగా ఏపీ సర్కారుకు అంత సత్తా ఉంటే..ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాజధానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క రాజధాని శాశ్వత భవనాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయింది. ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్న నాలుగు సంవత్సరాల్లో ఏ రోజూ కడప స్టీల్ ప్లాంట్ లో మాట్లాడింది లేదు. ఎప్పుడైతే ఎన్డీయే నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచో కడప ఉక్కు..ఏపీ హక్కు అంటూ హంగామా ప్రారంభించారు. కడప ఉక్కు విభజన చట్టంలో ఉన్న విస్పష్టమైన హామీ. హోదాను వదిలేసినా కనీసం ఉక్కు ప్రాజెక్టును సాధించటంలో కూడా చంద్రబాబు సర్కారు విఫలమైందనే చెప్పాలి. రాయలసీమ ప్రాజెక్టులను మభ్యపెట్టే ప్రయత్నాల్లో భాగంగానే చంద్రబాబు గురువారం నాడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లాలోని మైలవరం మండలం, కంబాలదిన్నెవద్ద కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్టీల్ ప్లాంట్ భాగస్వామి అన్వేషణ, ఇనుప ఖనిజం సరఫరా ఒఫ్పందాలు పూర్తవటానికే ఎంత కాలపడుతుందో తేలియదు. అవేమీ లేకుండా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంటే అది ఎంత సీరియస్ వ్యవహారం అర్థం చేసుకోవచ్చు.