కొత్త సంవత్సరం...కొత్త ఇంట్లోకి జగన్
ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో జగన్ పార్టీ కార్యాలయంతోపాటు..నివాస సముదాయం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నూతన ఆఫీసు , నివాస సముదాయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో జనవరి నెలలో జగన్ కొత్త ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. కొత్త ఆఫీసు, నివాస సముదాయం మొత్తం 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. పంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. పార్టీ కార్యాలయం కోసం జీ ప్లస్ వన్ భవనం, నివాస సముదాయం కోసం కూడా పక్కనే జీ ప్లస్ వన్ భవనం నిర్మించారు.
2017 నవంబర్ 6న జగన్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర 2019 జనవరి 8వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు విశ్రాంతి కోసం ఆస్ట్రియా లేదా వియన్నా వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అమరావతిలో కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత...పార్టీ కార్యక్రమాలు చూసుకుని వెంటనే పాదయాత్ర ద్వారా కవర్ కాని నియోజకవర్గాలను జగన్ బస్సు యాత్ర ద్వారా పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఎన్నికల నాటికి 175 నియోజకవర్గాల ను ఓ సారి కవర్ చేయాలనే యోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు.