Telugu Gateway
Politics

చంద్రబాబు ‘ముందస్తు’ అభ్యర్దుల ప్రకటన

చంద్రబాబు ‘ముందస్తు’ అభ్యర్దుల ప్రకటన
X

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తానని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. సహజంగా చంద్రబాబు చివరి నిమిషం వరకూ అభ్యర్దులను ప్రకటిస్తూనే ఉంటారు. మరి ఈ సారి అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఏ మేరకు అమలు అవుతుందో వేచిచూడాల్సిందే. ప్రభుత్వంపై ఎంతో సానుకూలత ఉందని.. పార్టీపై మరింత సానుకూలత రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకటికి పదిసార్లు ప్రజల వద్దకు వెళ్తేనే ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు పార్టీ నేతలు...సీనియర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. టెలికాన్ఫరెన్స్ లోని ముఖ్యాంశాలు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. అభ్యర్ధులను కూడా ముందే ప్రకటిస్తాం. మనం చేసిన పనులతో గెలుపు ఏకపక్షం కావాలి. కార్యకర్తలు అందరి ఇళ్లపై టిడిపి జెండాలు ఎగరేయాలి. ‘మళ్లీ టిడిపియే రావాలి’ అనే నినాదం మార్మోగాలి. గ్రామాలు,వార్డుల్లో ఇల్లిల్లు తిరగాలి. మళ్లీ టిడిపి రాకపోతే అభివృద్ది ఆగిపోతుంది. పేదల సంక్షేమం నిలిచిపోతుంది. రేపటి ‘జన్మభూమి-మావూరు’ బ్రహ్మాండంగా జరగాలి.

25లోక్ సభ,175అసెంబ్లీ స్థానాలే మన టార్గెట్. ఎలక్షన్ మిషన్ 2019 జోష్ అందరిలో రావాలి. అసెంబ్లీలో ఆధిక్యత ఎంపీ సీటు గెలుపునే డిసైడ్ చేస్తుంది. అందుకు కుప్పంలో వచ్చే ఆధిక్యతే ఉదాహరణ. అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిడిపి ఆధిక్యత భారీగా పెరగాలి. అన్ని నియోజకవర్గాలలో సెమీ క్రిస్మస్ వేడుకగా జరపాలి. ఈ నెల 30న జయహో బిసి విజయవంతం చేయాలి. వారంలోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి. బూత్ కన్వీనర్ల నియామకం,శిక్షణ పూర్తి చేయాలి. 5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించాలి. ఆయా పార్టీల ఓట్లశాతం,సీట్ల శాతం పరిశీలించాలి. డిసెంబర్ చివరి వారంలో శ్వేతపత్రాలు ఇస్తాం. 2014లో ఎక్కడ ఉన్నాం, ఈ 5ఏళ్లలో ఏం చేశాం,2019-24లో ఏం చేస్తాం అనేదానిపై స్పష్టంగా చెబుతాం. 5రాష్ట్రాల్లో ఎక్కడా బిజెపి గెలవలేక పోయింది. 3రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. 2 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే గెలిచాయి. దేశం మొత్తం మోది పాలనను తిరస్కరిస్తోంది. నరేంద్రమోది నినాదాలకే పరిమితం అయ్యారు. ఒక్క నినాదం కూడా నెరవేర్చలేదు. ఏపి మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లో అశాంతి. మైనారిటీల్లో అభద్రత పెంచారు. రాఫెల్ పై సుప్రీంకోర్టుకే తప్పుడు సమాచారం ఇచ్చారు. మోది పాలనా అరాచకాలకు ఇది పరాకాష్ట. దేశంలో మూడో కూటమికి ఉనికే లేదు. బిజెపికి దొడ్డిదారిన మేలు చేయడమే. విదేశాల్లో నల్లధనం తెప్పిస్తామన్నారు. ప్రతి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు. చెప్పింది బిజెపి చేయలేక పోయింది. అందుకే ఇప్పుడు ఆర్ బిఐ మిగులు నిధులపై కన్నేసింది. అది నచ్చకే ఆర్ బిఐ ఛైర్మన్లు రాజీనామాలు చేస్తున్నారు.

ఆర్ బిఐ,సిబిఐ,ఈడి,ఐటి అన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్ లో సోనియా చెప్పింది. దానిని సాకుగా చూపి కెసిఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టారు. టిఆర్ ఎస్ తొలుత హోదాకు అంగీకరించింది. తరువాత మళ్లీ అడ్డం తిరిగింది. తెలంగాణలో టిఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేస్తున్నారు. అక్కడ కెసిఆర్ గెలిస్తే ఇక్కడ వైసిపి నేతలకు పండుగలా..? ఫ్లెక్సీలు పెట్టి,టపాసులు కాల్చి సంబరాలు చేస్తారా..? జగన్ కు ఎప్పుడు ఒవైసీ దోస్త్ అయ్యారు. మోదియే వారిద్దరికీ దోస్తీ కుదిర్చారా..? వీళ్లందరూ మోది కనుసన్నల్లో పని చేస్తున్నారు. వీళ్లకు స్వప్రయోజనాలే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. ఏపీని దెబ్బతీయాలనే ధోరణి దుర్మార్గం.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it